గురజాడ


 శ్రీ గరికిపాటి గురజాడగారు బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు, గరికిపాటి శారద దంపతుల ద్వితీయ కుమారుడు. వీరు పుష్య శుద్ధ సప్తమి 1992 జనవరి 12, వివేకానంద జయంతి పండుగ రోజున, తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రిలో జన్మించారు. వీరు తెలుగులో ఎం.ఎ,   ఎం. ఫిల్, పిహెచ్. డి చేశారు.

          శ్రీగరికిపాటి గురజాడగారు 23ఏళ్ల యుక్త వయస్సులో వైకుంఠ ఏకాదశి 2015 డిసెంబర్ 20న ప్రవచన రంగంలోకి ప్రవేశించి ఇప్పటివరకు 150కి పైగా ప్రవచనాలు చేశారు. గురజాడగారు తండ్రి అడుగుజాడల్లో నడుస్తూనే ప్రవచన రంగంపై తనదైన ముద్ర వేసేందుకు నిర్విరామంగా కృషి చేస్తూనే ఉన్నారు. చిన్న వయస్సులోనే మనుచరిత్ర, వసుచరిత్ర, కాశీఖండం వంటి ప్రౌఢమైన కావ్యాలపై, రామాయణం, శ్రీమద్భాగవతం, శివానందలహరి, సౌందర్యలహరి వంటి ఆధ్యాత్మిక అంశాలపై తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో ప్రసంగించారు. అంతేకాకుండా వివిధ పాఠశాలల్లో, కళాశాలల్లో వ్యక్తిత్వ వికాసంపై ఎన్నో ప్రసంగాలు చేశారు.

గురజాడగారు కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాదు 2009లో నిర్వహించిన  ఐ.ఎం.ఏ. తెలుగు ప్రవేశ పరీక్షలో ద్వితీయ స్థానం సాధించినందుకు అప్పటి భారత రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా నగదు బహుమతిని అందుకున్నారు. అంతే కాకుండా, ఐ.ఎం.ఏ. తెలుగు (2009-2014)లో హైదరాబాద్ విశ్వవిద్యాలయ ప్రథమ స్థానం సాధించినందుకు అప్పటి తెలుగు రాష్ట్రాల గవర్నర్ శ్రీ నరసింహన్ గారి చేతుల మీదుగా బంగారు పతకంతో పాటు జవహర్లాల్ మెమోరియల్ ఫండ్ నుండి ప్రతిభాపురస్కారాన్ని కూడా అందుకున్నారు.

మనుచరిత్ర కావ్యంపై ఎం.ఫిల్ చేసిన గురజాడగారు ఆ కావ్యంపై పలుమార్లు ప్రసంగించి, మనుచరిత్ర- వ్యక్తిత్వ వికాసం అనే పుస్తకాన్ని సైతం వెలువరించారు. గురజాడగారు కవిత్రయభారతంపై పిహెచ్. డి చేశారు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతంలో చిన్న కథలు అనే ధారావాహికకి శ్రీకారం చుట్టి ఆ కథలు నిత్యజీవితానికి ఉపయోగపడే విధంగా ఆధునికమైన సమన్వయం చేస్తున్నారు.

అవార్డులు


సామాజిక మాధ్యమం