`తన వెంటన్ సిరి, లచ్చి వెంట నవరోధ వ్రాతమున్ దాని వె
న్నను బక్షీంద్రుడు, దాని వెన్నను ధనుఃకౌమోదకీ శంఖచ
క్ర ని కాయంబును, నారదుండు, ధ్వజనీ కాంతుడునై వచ్చిరా రొ
య్యన వైకుంఠ పురంబునం గలుగు వా రాబాల గోపాలమున్’

ఈ పద్యం ఆంధ్ర మహాభాగవతంలోని గజేంద్రమోక్షం ఘట్టంలోనిది. దీని అర్ధమే పోతన జీవన విధానం.

గజేంద్రుడు మొసలి బారి నుండి తనను కాపాడమని ఎవరిని ప్రార్ధించాడు? భాగవత పద్యాలలో చూస్తే “ఈశ్వరా” అనే సంభోధనలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ ఈశ్వరుడంటే శివుడు కాదు. విష్ణువూ కాదు. బ్రహ్మ అస్సలే కాదు. మొత్తం అనంతకోటి బ్రంహ్మాండాలకు అధిపతియైన పరమేశ్వరుడన్న మాట. అందుకే ’పరమేశ్వరుడెవ్వరు మూలకారణం బెవ్వడు’ అని పేర్కొన్నాడు.సర్వలోకాధిపతి, ఆత్మచైన్య స్వరూపుడు అయిన భగవంతుణ్ణి ప్రార్ధిస్తే విష్ణువు చక్రాయుధుడై వచ్చి కాపాడడమేమిటి? అంటే మనం భగవంతుణ్ణి ’ఫలానా రూపంలో వచ్చి నన్ను కాపాడు’ అని ప్రార్ధిస్తే అలాగే వస్తాడు. ఏ రూపమో ప్రత్యేకించి చెప్పకపోతే స్థితికర్త, పాలన, పోషణ చూసే బాధ్యత కలవాడు కాబట్టి విష్ణుమూర్తి వచ్చి కాపాడతాడు. లోకంలోనూ అంతే మనకు ఆపద వచ్చినప్పుడు ఎవరినైనా పేరుబెట్టి పిలిచి, లేదా వారింటికి వెళ్ళి అర్ధిస్తే వారే కాపాడతారు. అలా కాకుండా కాపాడండి, కాపాడండి అని అర్ధిస్తే దగ్గరలో పోలీసు వారు వచ్చి కాపాడతారు. రక్షణ బాధ్యత వారిది. వారే కాక మరో పది మంది కూడా వచ్చి కాపాడతారు. అందుకే విష్ణు రూపంలో సర్వేశ్వ్హరుడు వచ్చాడు.

అది సరే గజేంద్రుడు కేవలం భవవంతుణ్ణి వచ్చి తన ప్రాణాలు కాపాడమని మాత్రమే కోరాడు. కాని ఆయన వెంట లక్ష్మీదేవి, ఆమె వెంట అంతఃపుర స్త్రీలు, వారి వెంట గరుత్మంతుడు, అతని వెనుక విల్లు, గద మొదలైన ఆయుధాలు, ఆపైన వైకుంఠానికి విష్గ్ణు దర్శనం కోసం వచ్చిన నారద మహర్షి, ఇంకా సర్వసైన్యాధిపతియైన విష్వక్సేనుడు…ఒకరేమిటి వైకుంఠంలో ఉండే బాలుర నుండి గోపాలుర వరకు అందరూ గజేంద్రుని వద్దకు వచ్చేశారు. అంటే మనం భగవద్దర్శనం కోసం ప్రార్ధిస్తే చాలు. ఆ దర్శనంతోనే సిరిసంపదలు వస్తాయి. దాసదాసీజనం సమకూరుతాయి. వస్తు వాహనాలు కొనగలిగే శక్తి కలుగుతుంది. మన రక్షణ కోసం సర్వాయుధాలు వస్తాయి. మహాత్ములు, మహాయోగుల సాంగత్యము కలుగుతుంది. అత్యున్నత అధికారులు అందరూ మన చుట్టూ తిరుగుతారన్నమాట. ఈ రహస్యం తెలిసిన వాడు కాబట్టే పోతన మహాకవి రాజుల చుట్టూ, రాణుల చుట్టూ, మంత్రుల చుట్టూ, వ్యాపారుల చుట్టూ తిరగడం మానేసి ఒక్క విష్ణువు చుట్టూ మాత్రమే మనస్సుని ప్రదక్షిణం చేయిస్తూ భాగవతం రచించాడు. అందుకే ఆయన ఇహలోక జీవితమూ సుఖంగా ముగిసింది. (శ్రీనాధునిలా కాకుండా) పరలోకంలో మోక్షమూ దక్కింది. ఆయన రచించిన భాగవతం ఇవ్వాళ ప్రపంచమంతా ప్రశంసలందుకుంటోంది. ఈనాటి కవులూ, పండితులూ ఈ రహస్యం గ్రహించి మంత్రుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగకుండా భగవంతుని యందు విశ్వాసంతో, ఆత్మ విశ్వాసంతో తమ పని ఏదో తాము చేస్తే దక్కవలసిన గౌరవాలు అవే దక్కుతాయి.