మనిషి మెదడు రెండు భాగాలుగా ఉంటుంది. అందులో కుడిభాగం శాస్త్ర సాంకేతిక విషయాలకు ఎక్కువగా స్పందిస్తుందని, ఎడమభాగం కళాభావాలకు ఎక్కువగా స్పందిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక మనిషి మెదడులోనే రెండు భాగాల మధ్య ఇంత తేడా ఉన్నప్పుడు ఒకే భూమండలం మీద ప్రాక్పశ్చిమ భాగాల మధ్య మరెంతో తేడా ఉండటం ఆశ్చర్యమేమీ కాదు. తూర్పుదేశాలలో కవులు, కళాకారులు ఎక్కువగా ఉండడానికి, పశ్చిమదేశాలలో శాస్త్రవేత్తలు ఎక్కువగా ఉండటానికి కారణం ఇదే. ఇది భగవంతుని సృష్టిలోని వైవిధ్యమే తప్ప వైరుధ్యం కాదు.

రాగరంజితమైన ఒక సంధ్యాసమయం సహజ జలధారలతో సాగిపోయే నదీతీరంలో ఒక కొండ ప్రక్కన నిలబడి చూస్తున్న ఒక భారతీయునికి ఏమనిపిస్తుంది? అక్కడ ఎవరైనా ఒక గుడి కడితే బాగుండుననిపిస్తుంది. అదే ఒక పాశ్చాత్యునకైతే తానే ఒక ఖరీదైన హోటల్ కట్టేయాలనిపిస్తుంది. అదీ తేడా. ఈ బేధం వారికి మనకి భాషా నిర్మాణంలో, వేషధారణలో, భావధారలో, పరిశోధనా సారంలో, ఆలోచనలో ఆతిథ్యంలో, ధనార్జనలో, ధర్మ నిర్వహణలో అన్నింటా… అన్నింటా.. కనిపిస్తుంది.

అంత ప్రత్యేకతను సంతరించుకొన్న భారతీయ ధర్మ సంస్కారం ‘ఆముక్తమాల్యద’ కావ్యంలో ఎలా వ్యక్తమయ్యిందో చూద్దాం. ఈ కావ్య రచన విషయంలో పెద్ద చర్చ ఉంది. ఇంత లోతైన కావ్యాన్ని రచించే తీరిక రాయలకు లేదనీ దీన్ని పెద్దన్నో, మరెవరో రచించారని కొందరి అభిప్రాయం. కానీ ఈ కావ్య శైలికి పెద్దన శైలికి చాలా తేడా ఉంది. ఇందులో ఒక ‘రాజు’ మాత్రమే రాయగలిగిన పద్యాలు చాలా ఉన్నాయి. అదీగాక కవిత్వం రచించడానికి ఉండవలసింది తీరక కాదు. తీవ్రమైన కోరిక. ఆ కోరిక తీవ్రంగా ఉంది కాబట్టే పగలు ఉమ్మత్తూరు కోటపై దండెత్తి ఆ విశేషాల్ని రాత్రి కూర్చుని గోదాదేవి విరహ వేదనలో చేర్చి వర్ణించాడు. (తలిరుంగైదువు – ఆముక్త – 5-85)

ఇటువంటి వర్ణనల్నే కాస్త లోతుగా పరిశీలిస్తే భారతీయ జీవన మూల్యాలు చాలా చోట్ల కనిపిస్తాయి. ప్రథమాశ్వాసంలో విలుబుత్తూరు పురంలో అర్ధరాత్రి వీచిన ఒక గాలి సృష్టించిన చిత్రవిచిత్ర పరిణామాలు చూడండి.

‘మలయపు గాలి రేల వన్మాలి విమానపతాక ఘల్లుమం
చులియబసిండి మువ్వగమి నొక్కకమాటు గదల్పనుల్కిమి న్నలమి
తదీయ హేమవరణంచల చంపక శాఖలందు బ
క్షులు రొదసేయ వేగెనని కూడుదు రల్కలుమాని దంపతుల్’
(ఆముక్త – 1-74)

అర్ధరాత్రి అందరూ ఆదమరచి నిదురిస్తున్న వేళ మలయ పర్వతదిశ నుండి ఒక పిల్లగాలి వీచిందట. ఆ గాలి విష్ణుమూర్తి కోవెల పైనుండే విమాన పతాకను తాకిందట. ఆ పతాకకుండే పసిడి మువ్వలు ఘల్లు ఘల్లు సవ్వడి చేశాయట. ఆ మువ్వల సవ్వడికి గుడిగోడ ప్రక్కనే సంపెంగ చెట్టుమీద నిదురిస్తున్న పక్షులు నిద్రలేచాయట. ఆ పక్షుల రెక్కల చప్పుళ్ళు పడకగది కిటికీలోంచి వినబడి దంపతులకు మెలకువ వచ్చిందట. వారు పడుకొనేటప్పుడు ప్రణయ కోపంతో ఎడముఖం పెడముఖంగా పడుకున్నారట. అందుకే అర్ధరాత్రి వేళ పక్షుల రొదకు మెలకువ రాగానే తెల్లవారిందనుకొని భ్రమపడి మళ్ళీ ఏకాంత సమయం దొరకదు కదా అని దంపతులు కూడిమాడి ఆనందంగా గడిపారట.

గాలి వీయడం, ఆ గాలి తాకిడికి గుడిపైన మువ్వలు మ్రోగడం, ఆ మువ్వల సవ్వడికి పక్షులు నిద్రలేచి తెల్లవారిందనుకొని భ్రమపడి వేటకు బయలుదేరుతూ తోటి పక్షులను లేపుతూ పెద్దగా రొదచేయడం, ఆ పక్షుల రొదకు తెల్లారిపోయిందని భ్రమపడి అలకలు మాని దంపతులు అనురాగ బంధంతో ఏకమవ్వడం …ఇవన్నీ కలిసి ఒక చిత్రమైన సంపుటిలా పుష్పగుచ్ఛంలా లేవూ? భారతీయ జీవన దృక్పథం వెలుగులో ఈ సంపుటిని పరిశీలిస్తే ఇది చతుర్విధ పరుషార్ధాల సంపుటి తప్ప మరొకటి కాదని స్పష్టమవుతుంది.

గాలివీయడం ధర్మం. దాని ధర్మం అది చేసింది. పక్షులు వేటకు బయలుదేరడం అర్ధపురుషార్ధం – అంటే సంపాదన. దంపతులు లేచి కలవడం కామ పురుషార్ధం. ఈ నాలుగూ సహజంగానే సాధింపబడే విధానాన్ని ఈ కవిరాజు మనోహర శృంగార రసంతో జోడించి అద్భుతంగా చెప్పాడు. పైగా గాలి వీచి భ్రమపడివీయలేదు. సహజంగానే వీచింది. గుడిగంటలు భ్రమపడి మ్రోగలేదు. గాలి తాకిడికి సహజంగానే మ్రోగాయి. కాని పక్షులు తెల్లారిపోయిందనుకొని భ్రమపడి సంపాదనకు బయలుదేరతాయి. అలాగే దంపతులు కూడా తెల్లవారిందనుకొని భ్రమపడి కలిశారు. అంటే అర్ధకామాలు భ్రమతో కూడిన సుఖాలనిస్తాయని ధర్మమోక్షాలు భ్రమకు అవకాశమే లేని సహజానందాన్నిస్తాయని అర్ధం కావడం లేదూ? ఒక్క గాలి వీచినందువల్లనే ఈ పరిణామాలన్నీ జరిగాయి. అంటే నీ ధర్మం నువ్వు గాలి వీచినంత సహజంగా నిర్వహిస్తూపోతే ఉంటే మిగిలిన ఫలితాలు వాటంతట అవే కలుగుతాయనే పరమార్ధ రహస్యాన్ని ఈ పద్యం బోధించడం లేదూ? అసలీ దేశంలో దంపతులు అన్యోన్యంగా ఉండకుండా ఒక్కక్షణం ఎడముఖం పెడముఖంగా ఉంటే ఇక్కడ గాలి కూడా సహించదని ఏదో ఒకటి చేసి ఆ ఇద్దరినీ కలుపుతుందని అర్ధం కావడం లేదూ? మనది విడాకుల సంస్కృతి కాదనీ ‘మావిడాకుల’ సంస్కృతి అనీ ఈ పద్యం ఎలుగెత్తి చాటడం లేదూ? కేవలం నాలుగు పాదాల పద్యంలో నాలుగు పురుషార్ధాలకు సంబంధించిన గంభీరతత్త్వాన్ని పరమ సహనంగా చెప్పిన ఈ కవిరాజు పట్టాభిషేక మహోత్సవాలు అయిదు వందల ఏళ్ళేమిటీ! అయిదు వేల ఏళ్ళ తరువాత కూడా జరుపుకోవలసిందే.

ఈ కావ్యంలో తృతీయాశ్వసంలో ‘ఖాండిక్య కేశిధ్వజోపాఖ్యానం’ అని భారతీయ రాజనీతిని విశదీకరించే చక్కని కథ ఒకటి ఉంది. ఈ ఇద్దరికీ జరిగిన యుద్ధంలో ఖాండిక్యుడు ఓడిపోయి అడవులపాలయిపోతాడు. అయినా మంచి రోజుల కోసం ఎదురుచూస్తూ తాత్త్విక చింతనతో జీవితం గడుపుతూ ఉంటాడు. ఈలోగా జయించిన కేశిధ్వజుడు ఒక యజ్ఞం తలపెడతాడు. ఆ యజ్ఞధేనువు పులివాతబడి మరణిస్తుంది. మధ్యలో ఆగిపోయిన యజ్ఞాన్ని ఎలా పరిపూర్ణం చెయ్యాలో తెలియక పురోహితులనడిగితే వారీ విషయంలో సమగ్ర పరిజ్ఞానం ఉన్నవాడు ఖాండిక్యుడొక్కడే అంటారు. విజయగర్వంతో ఉండవలసిన కేశిధ్వజుడు ఏ మాత్రం సిగ్గుపడకుండా యజ్ఞ పరిసమాప్తి కోసం ఖాండిక్యుని ఆశ్రయిస్తాడు. తనని ఓడించాడానే బాధ, కక్ష ఏమాత్రం లేకుండా ఖాండిక్యుడు అతన్ని శిష్యునిగా స్వీకరించి అధ్వరపరిజ్ఞానాన్ని బోధిస్తాడు. గెలిచిన రాజుకి గర్వం లేకపోవడం, ఓడిన రాజుకి బాధలేకపోవడం ఇద్దరూ యజ్ఞం కోసమే తమ ధర్మాలు తాము నిర్వర్తించడమే ఆర్షధర్మ సంస్కారం. ఇది ఈ దేశంలోనే సాద్యం.

ఇంతటితో కథ అయిపోలేదు. ముగింపులో మరో చిత్రమైన తాత్త్వికమైన మలుపు. యజ్ఞ రహస్యాలు బోధించిన ఖాండిక్యునికి గురుదక్షిణ యిస్తానని కేశిధ్వజుడు వినయంగా విన్నవించి కోరుకుంటాడు. శత్రుత్వం శత్రుత్వమే. సంప్రదాయం సంప్రదాయమే. కోల్ఫోయిన రాజ్యాన్ని కోరుకున్నా ఇవ్వడానికి కేశిధ్వజుడు సిద్ధంగా ఉన్నాడు. అయినా ఖాండిక్యుడు రాజ్యము, సంపదలు శ్రమ లేకుండా వచ్చిపడుతున్నా సరే, కోరకుండా కేశిధ్వజునికి బాగా తెలిసిన బ్రహ్మజ్ఞానాన్ని తనకు బోధించమని అర్ధిస్తాడు. ఏమిరాజులు వీళ్ళు! ఏమి వీరి హృదయ గాంభీరాలు! అప్పుడు కేశిధ్వజుడు. ఆశ్చర్యపడి రాజ్యం ఎందుకు కోరుకోవడం లేదు అంటాడు. ఖాండిక్యుని సమాధానం చూడండి.

‘విను కేశిధ్వజ! ధాత్రివేడిమికి నావేదించెదన్ హేతు వ
జ్ఞానకున్ గాక వివేకికేల జనియించున్ కాల్యిమెందున్? రణం
బున బాడిన్ రిపు గూల్చు వాడియు ప్రజాపోషంబు ధర్మంబూ
జునకౌ; నైన నశక్తుద్వద్విజితరాజ్యున్నన్నఘం బంటునే?
(ఆముక్త -3 – 61)

‘భౌతిక సంపదలు కోరేవారు శ్రమపడకుండా దానధర్మాల ద్వారా పొందాలనుకోవడం అజ్ఞానుల లక్షణం. వివేకవంతుడు అలా ఆలోచించడు. యుద్ద రంగంలో జయించి క్షత్రియధర్మం ప్రకారం రాజ్యం స్వీకరిస్తేనే కానీ యాచన ద్వారా కాదు. అయినా నేను నీకంటె బలహీనుణ్ణి కాబట్టి నీ చేతిలో ఓడిపోయాను. ఇందులో నేను బాధపడి క్రుంగిపోవలసిందీ లేదు. నన్ను అంటుకొనే పాపమూ లేదు’ అంటాడు ఖాండిక్యుడు.

అంటే రాజులు క్షత్రియధర్మంగా భావించి ధర్మరక్షణ కోసం యుద్ధాలు చేశారు. కానీ రాజ్య కాంక్షతో కాదన్నమాట. మరి ధర్మం కోసమే అయితే ఇద్దరిదీ ధర్మం ఎలా అవుతుంది అంటే ఎవరి ఆలోచనను వారు ధర్మంగా భావించారన్నమాట. అంటే అక్కడ ఏదో ధర్మసంక్లిష్టత ఉందన్నమాట. యుద్ధం చేసినా ఓడినా, గెలిచినా వారు ఆశ్రయించింది ధర్మ మార్గాన్ని. ఆరాధించింది బ్రహ్మతత్త్వాన్ని. ఇదీ భారతీయ ధర్మ సంస్కారం. ఆముక్తమాల్యద కావ్యసారం. ఈ మహత్తర మానవీయ ధర్మ పరిరక్షణే.