సృష్టిలో ప్రతి ప్రకృతి శక్తిని దేవతగా భావించడం భారతీయ సంప్రదాయంలో విశిష్టత. ఒక్క ప్రకృతి శక్తులనే కాదు మన జీవితంలో అత్యవసరమైన ధనం మనదృష్టిలో వట్టి రూపాయి కాదు. సాక్షాత్తు లక్ష్మీదేవి. అలాగే జ్ఞానాన్నిచ్చే విద్య కేవలం చదువు కాదు. సాక్షాత్తు సరస్వతీదేవి.

అటువంటి సరస్వతిని బమ్మెర పోతన్న తన భాగవతంలో విశేషంగా ప్రార్ధించాడు. ఆ పద్యం భారతీయ విద్యావ్వవస్థను మొత్తం ప్రతిబింబిస్తుంది.

క్షోణితలంబు నెన్నుదురు సోకగ మ్రొక్కి నుతింతు సైకత
శ్రోణికి చంచరీకచయ సుందరవేణికి, రక్షితామర
శ్రేణికి, తోయజాతభవ చిత్త వశీకరణైక వాణికిన్
వాణికి, అక్షదామశుక వారిజ పుస్తక రమ్యపాణికిన్

ఈ పద్యం చివరి పాదంలో సరస్వతీదేవి చేతుల్లో జపమాల(అక్షదామం), చిలుక(శుకం), పద్మం(వారిజం), పుస్తకం ఉంటాయని వర్ణించాడు. మనం ఇప్పుడు చూస్తున్న సరస్వతి చేతుల్లో జపమాల, పుస్తకం ఉండి మరో రెండు చేతుల్తో వీణ వాయిస్తూ ఉంటుంది. పోతన ఈ మూర్తినే వర్ణించి ఉంటే వీణ ఎందుకు వదిలేస్తాడు? పైగా చేతుల్లో లేని పద్మాన్ని, చిలుకను, చేతుల్లోనే ఉన్నటుగా రమ్యపాణికిన్, అని ఎందుకు వర్ణిస్తాడు? అంటే మనం చూస్తున్న సరస్వతీమూర్తి వేరనీ, పోతన వర్ణించిన మూర్తి వేరనీ అర్ధమవుతోంది గదా! అయితే వీణ లేకుండా అక్షదాసు శుక వారిజ పుస్తకాలు చతుర్భుజాల్లో ధరీంచిన ఈ మూర్తి ఎవరు? ఇదే దృష్టితో వేదవిద్యలోను, సంస్కృత సాహిత్యంలోను నిష్ణాతులయిన పెద్దలతో ఆలొచిస్తే వారు పోతన వర్ణించింది ‘శారదామూర్తి’ అనీ, ఆవిడ వైదికవిద్యలకు అధిదేవత అనీ, మనం చూస్తున్న సరస్వతీమూర్తి లౌకిక విద్యలకు అధిదేవత అనీ వారి అభిప్రాయం చెప్పారు. ఈ వాదానికి సమర్ధనగా శృంగేరీ శారదాపీఠం వారు ప్రకటించిన శారదామూర్తిని చూస్తే ఆవిడ చేతుల్లో ఈ నాలుగు ఉండటం, వీణ లేకపోవడం కనిపిస్తుంది. మొత్తం మీద పోతన ప్రార్థించిన ‘వాణి’ లలితాదేవి యొక్క జ్ఞానస్వరూపంగా భావించే శారదాదేవి అని బోధపడుతుంది. మొత్తం మీద కొండని త్రవ్వి ‘ఎలుక’ని కాదు; ‘పలుకు చిలుక’ను పట్టగలిగాం.

ఇక – ఇప్పుడు అసలీ నాలుగు వస్తువులు శారదాదేవి చేతుల్లో ఎందుకు ఉంటాయి? వాటి పరమార్ధం ఏమిటి? అని ఆలోచిస్తే భారతీయ విద్యా లక్ష్యాలన్నీ బోధపడతాయి. భారతీయ జీవన విధానంలో ఒక ప్రత్యేకత ఉంది. ఏ మనిషయినా, స్త్రీ పురుషులలో ఎవరయినా ధర్మ, అర్ధ, కామ, మోక్షాలు వరుసగా సాధించడమే జీవిత లక్ష్యంగా భావిస్తారు. విద్యద్వారా ఈ చతుర్విధ పురుషార్ధాలు సాధించడమే లక్ష్యమని ఆ నాలుగు ప్రతీకలు సూచిస్తున్నాయి. అమ్మవారి చేతుల్లో ఉండే పుస్తకం ధర్మానికి ప్రతీక. పుస్తకం ద్వారానే మనకు అన్ని ధర్మాలు తెలుస్తాయి. పద్మం అర్ధానికి ప్రతీక. పద్మం నుండే లక్ష్మీదేవి జన్మించింది. పద్మం అనేది సంస్కృతంలో డబ్బు లెక్కపెట్టే ఒక సంఖ్య కూడాను. చిలుక కామ పురుషార్ధానికి ప్రతీక. జపతపాల ద్వారానే గదా సిద్ధిపొందేది. విద్య ద్వారా ఈ నాలుగు పురుషార్ధాలు సాధించాలనీ, అప్పుడే మనిషికి భవబంధాల నుండి విముక్తి అని తెలియజేయడం కోసమే విద్యాదేవత తన చేతుల్లో ఆ నాలుగు వస్తువులనీ ధరించిందనీ గ్రహించవచ్చు. ‘సావిద్యా యా విముక్తయే’ అని గదా ఆర్యోక్తి.

మనిషి ధర్మంగా జీవించాలి. మంచి వృత్తులు చేపట్టాలి. ఆ ధర్మం ద్వారా అర్ధం సంపాదించాలి. ఆ అర్ధం ద్వారానే సముచితమైన కామనలు (కోరికలు ) తీర్చుకోవాలి. ఆ కోరికల్లో పడి కొట్టుకుపోకుండా మోక్షం కోసం ప్రయత్నించాలి. ఇదే మానవజీవిత లక్ష్యమని భారతీయ సంస్కృతి ప్రబోధిస్తోంది. అందుకే పోతన అమ్మవారి స్వరూపాన్ని ఆ విధంగా వర్ణించాడు. ఇదీ తెలుగు పద్యం పరమార్ధం.