కథని కథలా నడిపిస్తూనే అంతరార్ధంగా పరమార్ధాన్ని బోధించడం మన పురాణాలలోని కథాకథనంలో అంతఃసూత్రం. పైకి చూస్తే మామూలుగా కథలో భాగమైన ఒక పాత్రనో, ఒక దృశ్యాన్నో, ఒక సందర్భాన్నో వర్ణిస్తున్నట్లుంటుంది. ‘లోనారసి’ చూడగలిగితే మనస్సు ప్రసన్నమై భగవద్భక్తి పూరితమైపోతోంది.

వామనచరిత్రలో వామనుని గర్భంలో ధరించిన అదితిని వర్ణిస్తూ పోతనగారు రచించిన పద్యం అటువంటిదే.
“నిలిపెన్ రెప్పల బృందిమన్
బుల నా కాళిమ, మేఖలన్ ద్రడిమ,
నెమ్మోమున్ సుధాపండిమన్
బలిమిన్ జన్నుల శ్రోణిపాళి గరిమన్
మధ్యంబునన్ బృంహిమన్
లలితాత్మన్ లఘిమన్ మహామహిమ మేనన్ గర్భదుర్హార్యై
(భాగ – 8 – 498)

మామూలుగా చూస్తే అందరు గర్భిణుల లక్షణాలే ఇందులో ఉన్నాయి. రెప్పలు దట్టమయ్యాయి. కనుగ్రుడ్లు మరింత తెల్లబడ్డాయి. స్తనాగ్రాలు మరింత నల్లబడ్డాయి. నడుము ధృడమయ్యింది. ముఖంలో స్వఛ్ఛత పెరిగింది. వక్షోజాలు గట్టిపడ్డాయి. కటిభాగం విస్త్రుతమయింది. పొట్ట పెద్దదయింది. కానీ మనస్సు మాత్రం దూదికన్న తేలికైపోయింది. మొత్తం మీద శరీరంలో ఒక ‘మహామహిమ’ దర్శనమిస్తోంది.

ఆ మహిమ ఏమిటో పోతనచెప్పాడు. మనం ఆలోచించి తెలుసుకోవాలి. పద్యంలో మూడు, నాలుగు పాదాలలో గరిమ, మహిమ, లఘిమ అనే పదాలకేసి ఒకసారి పరిశీలనగా చూడండి.ఇవి అష్టసిద్ధుల్లో మాటలు కాదూ?

‘అణిమా ;మహిమాచైవ గరిమా లఘిమా తథా ప్రాప్తిః ప్రాకామ్యమీశత్వం వశిత్వంచాష్ట సిధ్దయః”
అంటారు కదా! మహాయోగులకు మాత్రమే ప్రాప్తించే అష్టసిద్ధులు అదితిగా అలవోకగా లభించడమేమిటి? దేవత కాబట్టి అలా సిద్ధించాయి అనుకొందామా అంటే దేవతా స్త్రీ లెవరికీ అలా సిద్ధించినట్ట్లు ఆధారాలు లేవే.

ఇక్కడ మనకు స్ఫురించి తరింపజేసే రహస్యం ఒక్కటే. ఆమె శ్రీమన్నారాయణుని గర్భంలో ధరించింది. భగవంతుడు మన ఇంట్లోగానీ, అదృష్టం బాగుంటే ఒంట్లో గానీ ప్రవేశిస్తే అణిమ, మహిమ వంటి మహాయోగసిద్ధులన్నీ అలవోకగా మనకు వశమైపోతాయని ఆమె గర్భిణీ రూప వర్నన ద్వారా తెలియజేస్తున్నాడు పోతన.

అష్టసిద్ధులకు సంబంధించిన ‘గరిమ’, మహిమ, లఘిమ’ అనే మహిమాన్వితమైన మాటలు చివరలో ప్రయోగించడం ఎందుకంటే ఎంతోకాలం కష్టపడి యోగాభ్యాసాలు, ధ్యానధారణలు, తత్త్వవిచారణలు చేస్తే చిట్టచివరలో ఈ సిద్ధులు లభిస్తాయనీ, వాటి ప్రభావంలో పడి మోసపోకుండా ‘లలితాత్మను’ కాపాడుకుంటూ సాగితే తుట్టతుదకు ఎట్టకేలకు మహామహిమాన్వితుడైన భగవంతుని దర్శనం అవుతుందని మనకు తెలియజేయడమన్నమాట. అందుకే చిట్టచివర ‘మహామహిమ’ అనే పదం వాడాడు సహజపాండిత్యుడు.

ఏదో ఒక రూపాన్ని ప్రేమించి, ఏదో ఒక నామంతో నిరంతర స్మరణ చేస్తూ ఉంటే మన మనస్సులో ఆయన కొలువుండటం ఖాయం. ఆయనే స్వయంగా వచ్చి కొలువున్నాక అష్టసిద్ధులేమిటి? అండపిండ బ్రహ్మాండాలన్నీ మన ఒంట్లోనే కనిపిస్తాయి. దాన్నే మంత్ర పుష్పంలో ‘అథోనిష్ట్యా వితస్స్యాంతే నాభ్యాముపరితిష్టతి’ అని మొదలుపెట్టి తస్యాః శిఖాయా మధే పరమాత్మా వ్యవస్థితః’ అని ముగించి నీ శరీరంలోనే బ్రహ్మ, విష్ణువు, శివుడు మొదలైన సమస్త దేవతలూ ఉన్నారు చూసుకో అన్నారు.

అదే విషయాన్ని గజేంద్ర మోక్షంలో పోతన్నగారు ‘తనవెంటన్ సిరి, లచ్చివెంట నవరోధవ్రాతమున్’ అనే పద్యంలో పరోక్షంగా కవితాత్మకంగా చెప్పారు. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎన్ని చదివినా, ఎవరు ఎన్ని విన్నా కావలసింది ఆచరణ. ఆచరణ అంటే ఆ శ్రీ చరణాలు అందుకోవడం మరీ అంత కష్టమేంకాదు.