శ్రవణం, కీర్తనం, స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం..

అనే తొమ్మిది రకాల భక్తి మార్గాలలో కీర్తనం వరసకు ద్వితీయమైనా వాసికి అద్వితీయం. మిగిలిన ఎనిమిది రకాల మార్గాల్లో పనిసాగుతున్నా మనస్సు లీనమవుతోందో లేదో తెలియదు. కానీ కీర్తనంలో ఉండే గానధర్మం వల్ల మనస్సు సహజంగానే ఆకర్షింపబడుతుంది. ఆ స్థితి కూడా లేని మందభాగ్యులకి కనీసం కొంతసేపు సత్కాలక్షేపం చేశామన్న సంతృప్తి అయినా మిగులుతుంది.

భగవత్సంకీర్తనలో ప్రథమాచార్యునిగా కీర్తించబడే నారదుడు నారాయణ నామ స్మరణలో పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. ఆ సంకీర్తన ఆయనకి మూడు లోకాల్లో ఏడువాడలూ తిరిగే సామర్ధ్యాన్ని ఇచ్చింది. ఆ తరువాత అంతటివాడు, తనకు తెలియకుండానే నారదునికి శిష్యుడైన వాడు ప్రహ్లాదుడు. ఈయన గురువును మించిన శిష్యుడు. నారదుడు సంతోషంగా ఉండి సంకీర్తన చేస్తే ఈయన సంక్షోభంలో కూడా అదేపని అంత ఆనందంగా చేశాడు.

తన్ను నిశాచరుల్ పొడువ దైత్యకుమారుడు మాటిమాటికి పన్నగశాయి! యోదనుజ భంజన! యో జగదీశ! యో మహాపన శరణ్య! యో నిఖిల పావన యంచును తించుగాని తా, గన్నుల నీరు దే డు భయకంప సమేతు డు కాడు భూవరా!

హిరణ్యకశిపుని ఆజ్ఞ ప్రకారం రాక్షస్ భటులు భయంకరంగా హింసిస్తుంటే ప్రహ్లాదుడు చేసిన పని ఈ సంకీర్తనే. బాధలను భరిస్తూ భగవద్గుణ గణ గానం చేశాడే కానీ దీనంగా ఏడుస్తూ కూర్చోలేదని పోతన గారు మనకి సందేశం ఇస్తున్నారు. మనోవేదనకు మందు లేదు అంటారు కానీ మనం ఒక నిశ్చయానికి రాగలిగితే మనో వేదనని మరిచిపోవచ్చు. కానీ శరీర బాధ అలాంటిది కాదు. మనం తీసేద్దామంటే పోదు. దాని సమయం అది తీసుకుని క్రమంగా తగ్గుతుంది. అంతటి భయంకరమైన హింసని అనుభవిస్తూ ప్రహ్లాదుడు భగవత్కీర్తన మాన లేదంటే ఆ కీర్తన అతనికి ఎంత బలాన్ని ఇచ్చిందో తెలుస్తోంది. మనకైనా అంతే.

భారతకాలంలో కేవల సంకీర్తన ద్వారా సంతాప సమయాలను కూడా సమర్ధంగా ఎదుర్కోగలిగిన ధీరభక్తురాలు స్వయంగా భగవంతునికి మేనత్త అయిన కుంతి.

శ్రీ కృష్ణా! యదుభూషణా! నరసఖా! శృంగార రత్నాకరా! లోకద్రోహి నరేంద్రవంశదమనా! లోకావనా! దేఅతానీక బ్రాహ్మణ గోగణార్తి హరణా! నిర్వాణ సంధాయకా! నీకున్ మ్రొక్కెద ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ!

నిరంతరం కుంతి యిటువంటి సంకీర్తనతో కాలం గడిపేదని పోతన గారు భాగవతంలో చెప్పారు. ఇందులో భగవంతునికి భక్తుడు క్రమక్రమంగా దగ్గరయ్యే విధానం కనబడుతుంది. ముందు పేరుతో పిలవడాం, అనంతరం మా పుట్టింటి వారింటి మాణిక్యమా (యదుభూషణా) అనడం, తర్వాత మా అబ్బాయుఇకి మరో ప్రణమా (నరసఖా) అనడం – ఇవన్నీ క్రమక్రమంగా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని ఆత్మీయం చేసుకునే విధానాలు. భగవంతుని బంధువుగానే కాకుండా ఆత్మబంధువుగా భావించించి కాబట్టే ఆ మహాసాధ్వి అప్పుడప్పుడూ ఆపదలు వచ్చేలా చూడమని (విపదః సంతునః) ధైర్యంగా కోరగలిగింది. ఆపదల్లోనే మనం ఆయన్ని ప్రార్ధిస్తామనే బలహీనతని అర్ధం చేసుకొని మనందరి పక్షాన కుంతి దేవదేవుని ఆ కోరిక కోరింది.

కీర్తన ఫలం గురించి తెలుసుకోవాలంటే ఆముక్తమాల్యదలో మాలదాసరి కథ తెలుసుకోవాల్సిందే. ప్రమాదవశాత్తు రాక్షసుని బారిన పడ్డ దాసరి నారాయణుని ఆలయం ముందు చివరికీర్తన పడి మళ్ళీ వచ్చి ఆహారంగా తనని తాను సమర్పించుకొంటానని వాగ్దానం చేసి వెళ్ళి, చెప్పిన సమయానికి తిరిగివచ్చి మాట నిలబెట్టుకుంటాడు. ప్రాణం పోతున్నా సరే మాట తప్పకుండా ఉండేంత గుండెబలం భారతీయులకి, అందునా భక్తులకే సాధ్యమేమో! వచ్చిన దాసరిని చూసి పశ్చాత్తప్తుడైన బ్రహ్మరాక్షుసునికి కళ్ళు తెరుచుకొని ఆ ప్రభాత కీర్తన ఫలం తనకు ధారపొయ్యమంటాడు. కీర్తనవ విలువ అనంతమని తెలిసినా దయాగుణంతో ధారపోసిన దాసరి ఔదార్యం వల్ల అతనిలోని రాక్షసత్వం పోయి బ్రహ్మత్వం మిగులుతుంది అదీ హరినామసంకీర్తన ఫలం.

అష్టదిగ్గజాల్లో ఒకడైన ధూర్జటి తన శ్రీకాళహస్తీశ్వర శతకంలో శివనామ సంకీర్తన అసాధ్యాలను సుసాధ్యాలుగా చేస్తుందని నిరూపించాడు.

పవి పుష్పంబగు, నగ్నిమంచగు, నకూపారంబు భూమీ స్థలంబవు, శత్రుండతి మిత్రుడౌ, విషము దివ్యాహారమౌ నెనగా నవనీ మండలి లోపలన్ శివశివేత్యాభాషణోల్లాసికిన్ శివ! నీ నామము సర్వ వశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వరా!

శివనామ సంకీర్తన నిరంతర చేస్తూ ఉండే వారి మీద పిడుగులు పడితే అవి పూలుగా మారిపోతాయి. వారి ఇంటి కంటుకొన నిప్పు మంచుగా మారిపోతుంది. వారు ప్రమాదవశాతు సముద్రంలో జారిపడితే వారికోసం ఒక ద్వీపం అప్పటికప్పుడు, అక్కడికక్కడే రూపొందుతుంది. వారి శతృవులు వారింటి ముందుకు వచ్చి స్నేహహస్తం చాపుతారు. వారి మీద ఎవరైనా విష ప్రయోగం చేస్తే అది వారికి పోషకాహారం అవుతుంది. వీటన్నింటికీ ఉదాహరణలు పురాణకాలంలోనే కాదు, నవీన కాలంలోనూ దొరుకుతాయి.

నవీనకాలంలో మనకంటే ముందుతరంలో సంకీర్తన వల్ల మహాయోగం పొందిన నాదయోగి త్యాగరాజు.

“రాగము రామపాదమనురాగము జానకి కాలి అందెలన్ మ్రోగెడి దివ్యనాద, మనుమోదిత తాళము వాయునందనుండేగిన సాగరోర్మికల నెంతయునూపెడి మిశ్రచాపమై త్యాగయ పాడె సత్కృతులు ధారుణి తెల్గుల వెల్గు నింపుచున్” – (సాగరఘోష)

త్యాగరాజ స్వామి సత్కారాల కోసం, పురస్కారాల కోసం, పద్మభూషణాల కోసం కీర్తనలు పాడలేదు. ఆయన కీర్తనల్లో రాగం రామునిపాదం. ఆర్ధ్రత సీతామహాసాధ్వి పాదమంజీర ధ్వని. మారుతి తరించిన మహాసాగర పాటకుతాళం. అంతిమ లక్ష్యం ఆత్మానందమని త్యాగరాజు తన కీర్తనల ద్వారా సంగీత సహిత్యవేత్తలకు సలహా ఇచ్చాడు. పాటించడం పాటించకపోవడం మన సంస్కారస్థాయికి సంబంధించిన విషయం.

చివరగా ఒక చమత్కారం “రామ” అనే శబ్దాని తెలిసి పలికినా తెలియక పలికినా ఎటువంటి పలుకుల్లో భాగంగా పలికినా అవి జీడిపప్పు పలుకులై ముక్తి సుగంధాన్ని మనస్సుకి అందిస్తాయట. ఒకానొక అరణ్యంలో వేటాడుతూ తిరుగుతున కిరాతుల్ని ఎవరు ప్రశ్నించినా వారు వారి దినచర్యను ఈ విధంగా వివరిస్తునారట.

వనే చరామః వసుచాహరామః

నదీ స్తరామః న భయం స్మరామః

ఇతీరయంతో విపినే కిరాతాః

ముక్తింగతా రామపదానుషంగాః

మేం అడవుల్లో తిరుగుతూ ఉంటాఅ(చరామః) జంతువుల్ని (ఆహరామః), నదీ నదాలు సులువుగా దాటేస్తూ ఉంటాం(తరామః). భయం మా మనస్సులోకే రాదు (న స్మరామః),” అంటూ ఉంటే అనుకోకుండా ఆ మాటల్లో రామః రామః అని పలుమార్లు రావడం వల్ల రామసంకీర్తన చేసిన ఫలం లభించి వారి మోక్షం పొందగలిగారట. ఎంత చమత్కారం లీలా మానుష వేషధారియైన భగవంతుని దృష్టిలో ఈ సృష్టియే ఒక పెద్ద చమత్కారం.

అంత శక్తి గల్గిన భగవన్నామ సంకీర్తనతో జీవుడు ఆనందలహరిగా మారి ఆత్మానంద మహా సాగరంలో లీనం కావడమే జీవన పరమార్దం.