ధూర్జటి అంటే శివుడు. ఆయన తెల్లగా ఉంటాడు. కాని నల్లగా ఉండే ధూర్జటి మరొకరున్నారు. ఆయనయే కృష్ణ దేవరాయల కాలంనాటి కవి ధూర్జటి. కవి ధూర్జటి నల్లగా ఉన్నాడని మనకెలా తెలుసంటే – తాను తెల్లగానో, ఎర్రగానో ఉండి ఉంటే ఆయన అందాన్ని గురించి ఆయన శతకంలో ఎక్కడో ఒకచోట ప్రస్తావించి ఉండేవాడు. అలా ప్రస్తావించ లేదు-కాబట్టి నల్లగా ఉన్నాడని అనుకొందాం. అప్పుడు ’కృష్ణధూర్జటి’ అనే పేరు చక్కగా సరిపోతుంది. పైగా కృష్ణరాయల ఆస్థానంలో ఉండే ధూర్జటి అని స్ఫురించే అవకాశం కూడా ఉంది.

అల్లసాని పెద్దన్న, నందితిమ్మన్న, మాదయ గారి మల్లన వంటి వారు రాయల ఆస్థానంలో ఉన్నారంటే ఆశ్చర్యం కలగదు కానీ ’ఛీ చీ ఈ రాజ శబ్దంబు జన్మాంతరమందు నొల్లను సుమీ’ అని కంఠోక్తిగా ప్రకటించిన ధూర్జటి ఒక రాజు ఆస్థానంలో అందునా ఎనిమిది మంది కవి పండితుల మధ్యలో చిరకాలం ఉండగలిగాడంటే అబ్బురం కలిగించే విషయమే.

శ్రీ కృష్ణదేవరాయల కవిపండిత పోషణ, వినయ విధేయతలు, పరమత సహనం విశాల దృక్పథం ధూర్జటి వంటి వీరశైవుణ్ణి, స్వాభిమానిని, రాజ భోగద్వేహిని, కుండబద్దలు కొట్టినట్లు పద్యాలు చెప్పే నిరంకుశ కవిని ఆ ఆస్థానంలో చిరకాలం కొనసాగేలా చేశాయి.

“ఆజుత మత్తులటంచు దిట్టినను రారమ్మిందు కూర్చుండుమా
పూజల్ సేయుదునంచు ధూర్జటి కవిన్ పోషించె నారాయలే
జాజుల్ పూచెడి కైత లెక్కగొనునా శైవాది భేదమ్ములన్
చేజల్లెన్ శశికాంతు లక్షతలుగా శ్రీకాళ హస్తీశుడే (సాగరఘెష -3-98)

తనలాంటివారే అయిన రాజుల్ని ఘెరంగా తిట్టిన ధూర్జటిలో కూడా కృష్ణ దేవరాయులు కవిత్వాన్ని చూసి గౌరవించాడు. ఆ సంస్కారం మనం ఇంకా అలవాటు చేసుకోవాలి. కవిత్వపుచిగురు కనిపిస్తే చాలు చెట్టుకి సాష్టాంగ పడే స్వభావంగల రాయలు ధూర్జటికి బాగా నచ్చినరాజు. అందుకే అంతటి సర్వతంత్ర స్వతంత్రుడైన కవి ఎన్నో కష్టనష్టాలు తట్టుకొని కూడా రాయల ఆస్థానంలోనే చివరివరకు నిలబడ్డాడు. కృష్ణదేవరాయలంటే కవిని పల్లకి నుండి పాద మొక పట్టున నేలను మోపనీని రాట్తల్లజుడు’ గదా!

ఎవరా పల్లకి నెక్కియున్నది? అహో! ఎవ్వారలాపల్లకిన్
చివురుంగేలను మోయచున్నది? భళా! శ్రీకృష్ణ రాయప్రభూ
కవికిన్ బ్రహ్మరథమ్ము పట్టితివి నీ కావ్యమ్ము ఖడ్గమ్ము జం
కవురా భూతలమందునెల్లెడ గుణ గ్రాహి ప్రపంచంబునన్ (సాగరఘోష -3-92)

ఇంతటి కవితా ప్రేమికుడైనా కృష్ణ దేవరాయల ఆస్థానంలో ప్రవేశం అంత సులభమేమీ కాదు. ఆ విషయాన్ని ధూర్జటి తన శతకంలో పరోక్షంగా చెప్పనే చెప్పాడు.

“వాణీవల్లభ దుర్జభంబగు భవద్ద్వారంబునన్ నిల్చిని
ర్వాణాశ్రీ జెరబట్ట జూచిన విచారద్రోహమో! నిత్యక
ల్యాణక్రీడల బాసి దుర్దశల పాలై రాజలోకాధమ
శ్రేణిద్వారము దూరజేసెదెపుడున్ శ్రీకాళహస్తీశ్వరా (శీ.కా.శతకం -2)

నిజంగానే పెద్దనాది దిగ్గజాలతో నిండిన శ్రీకృష్ణదేవరాయల భువన విజయ సభాభవనంలో స్థానం సంపాదించడం బ్రహ్మకు కూడా ఆరోజుల్లో దుర్లభమైనదే అసలిన్ని కష్టాలు పడి ఈ రాజులను ఆశ్రయించడం ఎందుకో అర్థంకాక ధూర్జటి అటువంటి అమాయకులను చూసి ఓ నవ్వు నవ్వాడు.

“మదమాతంగములున్ రథం బులు హరుల్ మాణిక్యముల్ పల్లకుల్
ముదితల్ చిత్రదుకూలముల్ పరిమళంబుల్ మోక్షమీజాలునే
మదిలో వీనినపేక్షజేసి నృపథామ ద్వార దేశంబుగా
చి దినంబుల్ వృథ పుత్రురజ్ఞలకటా! శ్రీ కాళ హస్తీశ్వరా!” (శ్రీ.కా.శ.-31)

ఎప్పుడు పడేస్తుందో తెలియని ఏనుగు ఎక్కడం కోసం, ఒళ్లంతా కుదిపేసే రథాలు అధిరోహించడం కోసం, ఒంటి మీద నిలబడని పట్టువస్త్రాల కోసం, పదినిముషాల్లో ఆవిరైపోయే పరిమళాల కోసం ఈ కవి పండితులు ఆశపడి ద్వారం ద్వారానికి ద్వారపాలకులు అడ్డగిస్తున్నా, అంగరక్షకులు అవయవాలు కుళ్లబొడుస్తున్నా, మహాపండితుల్ని మామూలు మనుషుల కంటే ఘెరంగా మందలిస్తున్నా ఆ మహారాజు దర్శనం కోసం తపించడం, ఆయన అనుగ్రహం కోసం అంగలార్చడం ధూర్జటిని ఆశ్చర్యపరిచింది. ఆవేదనకు గురి చేసింది.

సరిగ్గా ఈ ఆలోచనయే ధూర్జటి పట్ల రాయలకు ప్రత్యేకాకర్షణ కలిగేలా చేసింది. కృష్ణరాయలకు ఆత్మతత్త్వం క్షుణ్ణంగా తెలుసు. ఆ విషయం ఆముక్త మాల్యద చదివితే మనకు తెలుస్తుంది. ఆయనకు ఆత్మతత్త్వం, భౌతికభోగాల క్షణికత్వం అర్థం కాకపోతే ఆముక్తమాల్యదలో కథావస్తువు అలా ఉండదు. దిగ్విజయాలు సాధించిన పాండ్యరాజు ప్రియురాలి యింటికి వెళుతూ పురోహితుని యింట్లోంచి వినబడిన శ్లోకం విని ఆగి పోవడమేమిటి?

“వర్షార్థ మష్టౌ ప్రయతేతమాసాన్
నిశార్థ మర్థం దివసం యతేత
వార్థక్య హేతోర్వయసా నవేన
పరత్ర హేతో రిహజన్మనాచ”

వర్షకాలం కాలుకదపకుండా కాలక్షేపం చెయ్యాలంటే మిగిలిన ఎనిమిదినెలలు కష్టపడి సంపాదించుకోవాలి. రాత్రి సుఖంగా నిద్రపట్టాలంటే రేపటికి పొయ్యిలోకి పొయ్యిపైకి ఉండేలా చూసుకోవాలి. వృద్ధాప్యం సుఖంగా గడవాలంటే యౌవనంలో సంపాదించింది దాచుకోవాలి అలాగే మోక్షం పొందాలంటే ఈ జన్మలోనే పుణ్యకార్యాలు చేసి చిత్త శుద్ధి పొంది తత్త్వజ్ఞానం పొందాలి భోగాలనుభవిస్తూ కూర్చుంటే అంతూదరీ ఉండదు. సరిగ్గా ధూర్జటి శతకంలో వ్యక్తం చేసిన భావాలివే.

అమరస్త్రీల రమించినన్ జెడదు మోహం బంతయున్ బ్రహ్మప
ట్టము సిద్ధించిన నాసతీరదు నిరూఢ క్రోథమీ యెల్లలో
కములన్ మ్రింగిన మానదిందుగల సౌఖ్యం బొల్ల; నీసేవజే
సి మహ పాతక వారి రాశి గడతున్ శ్రీకాళ హస్తీశ్వరా (శీ.కా.శ.42)

ఇరువురి భావాలు తీవ్రభక్తితో నిండినవే. ఇరువుతూ స్వేచ్ఛాప్రియులే, ఇరువురూ పైకి గంభీరమైన ప్రవృత్తి లోపల తీవ్రమైన నివృత్తి కలిగిన వారే అందుకే ధూర్జటి కోరినట్లుగానే ’సర్వమునకున్, మధ్యస్థుడు, సత్యదాన దయాదుల్ గల’ కృష్ణదేవరాయలను ధూర్జటికి సంరక్షకునిగా శివుడు అనుగ్రహించాడు. పిండి కొద్దీ రొట్టె. భక్తి కొలదీ భగవదనుగ్రహం.