తెలుగు పద్యానికి ప్రపంచ సాహిత్యంలోనే ప్రత్యేక స్థానం ఉంది. ఆ ప్రత్యేకతలో సగభాగం దాని నడకలోనే ఉంది. ఆ నడక అందంగా ఉండాలంటే కవి పద్య నిర్మాణం పట్ల శ్రద్ద వహించాలి. అటువంటి శ్రద్దాయుతమైన పద్య నిర్మాణం ఎలా ఉంటుందో పోతన గారి భాగవతంలోని “వామన చరిత్ర” ఘట్టంలో చూద్దాం.

బుజ్జి వామనుడు బలి చక్రవర్తి సభామండపంలోకి ప్రవేశించాడు. కొందరు ఆశ్చర్యంగా, కొందరు ఆనందంగా, ఇంకొందరు అసూయగా చూస్తూ ఉండగా ఆ బాలుడు అడుగులో అడుగు వేసుకుంటూ నడచి వస్తున్నాడు. ఆ నడకల్ని పోతన ఎంత శాస్త్రీయంగా, మనో విశ్లేషణాత్మకంగా వర్ణించాడో చూడండి.

“వెడ వెడ నడకలు నడచుచు
నెడ నెడ నడుగులకు నడరి యిల దిగబడగా
బుడి బుడి నొడువులు నొడవుచు
జడిముడి తడబడగ వడుగు చేరెన్ రాజున్”

వామనుడు పసిబాలుడు. కాబట్టి తప్పడగులు వేయడం సహజం. అందుకే ’వెడవెడ నడకలు’ అనే ప్రయోగం. నడుస్తూ ఉంటే పడిపోతానేమో అనే భయంతో నడవడం బాలుని నైజం. ఇక్కడ తల్లి దగ్గరకు చేరుకునే పసిబాలుని నడకను మనం ఊహించుకోవాలి. నడక నేర్పేడప్పుడు కొంచెం దూరంగా నిలబడి దగ్గరకు రమ్మని పిల్లవాడిని ప్రోత్సహిస్తూ ఉంటుంది. అతడు దగ్గరకు వస్తున్న కొద్దీ తాను కొంచెం దూరం జరుగుతూ పిల్లాణ్ణి మళ్ళీ మళ్ళీ రమ్మని పిలుస్తూ వాడు పడిబోతుంటే దగ్గరకు వెళ్ళి పట్టుకోబోతున్న భద్రతా భావాన్ని కల్స్పిస్తూ చివరికి దగ్గరకు వచ్చే సమయానికి తన చేత్తో అందుకోబోతున్నట్లు నటిస్తూ గొప్ప శిక్షణనిస్తుంది. ఈ వాతావరణమంతా ఈ చిన్న పద్యంలో ఇమిడ్చాడు పోతన్న. ’ఎడనెడ నడుగులు’ అటూ యిటూ వేసే తప్పటడుగులన్నమాట. ’అడరి ఇల దిగబడగ’ అంటే ఆ బాలుడు భూమి మీద జారిపోతున్నాడేమో అనీ చెప్పుకోవచ్చు. ఆ బాలుడు సాక్షాత్తూ విష్ణుమూర్తి కాబట్టి ఆయన అడుగుల భారానికి భూమి దిగబడిపోయేలా ఉందనీ చెప్పుకోవచ్చు. ’ఇల’ అనే శబ్ధం తరువాత ద్రుతం లోపించిందనుకుంటే ఈ రెండు అర్ధాలు సరిపోతాయి. ఇంతకు మించిన విశేషం మరొకటుంది.

ఇది ఇంచుమించుగా సర్వలఘుకందం. తప్పనిసరి కాబట్టి రెండవ, నాల్గవ పాదాల చివర గురువుంది. కానీ వాటితో పాటు నాల్గవ పాదం చివరలో ’చేరెన్ రాజున్’ అంటూ నాలుగు గురువులు వేశాడు. అన్నీ లఘువులే వేసిన పద్యంలో చివరలో అకస్మాత్తుగా నాల్గవ గురువెందుకు?. తల్లిని చేరుకోడానికి ప్రయత్నించే బాలుడు నెమ్మది నెమ్మది గా నడుస్తూ తల్లి దగ్గరయ్యేసరికి ఆనందంతో ఒక్కసారిగా వేగం పెంచి ఆమె ఒడిలోకి దూకేస్తాడు. ఇక్కడ వామనుడు కూడా అంతవరకూ నెమ్మది నెమ్మదిగా నడుస్తూ, అందర్నీ పలకరిస్తూ ఉన్నవాడు ’బుడిబుడి నొడువులు నొడువుచ” ఒక్కసారిగా బలి చక్రవర్తి దగ్గరయ్యే సరికి లక్ష్యాన్ని చేరుకున్నానన్న ఆనందంతో గబగబా నడుస్తాడు. ఆ వేగమే ఈ నాలుగు గురువుల ప్రయోగానికి కారణం (చేరెన్ రాజును). ఇదీ ఆయన మనస్తత్వ పరిశీలన. పాత్రోచిత రచన సందర్భోచిత శయ్య. పద్య నిర్మాణంలోనే బాలుని నడకను అందులో రకరకాల దశలను చిట్ట చివరి వేగాన్ని చూపించగల ఈ శక్తి తెలుగు పద్యానికే ఉందేమో!