భారతీయ సాహిత్యంలో ముఖ్యంగా ఆధ్యాత్మిక సాహిత్యంలో ఒక ప్రత్యేకత ఉంది. ఏ విషయాన్నైనా ఎంతగా విస్తరించి చెప్పగలదో అంతగా కుదించి కూడా చెప్పగలదు. ఇది మహాకవుల, మహావక్తల లక్షణం. భారతీయ జీవన విధానానికి ఒక ప్రత్యేకత ఉంది. ధనకన్క వస్తు వాహనాలను ఎంతగా సంపాదించి విస్తృతమైన సంసారాన్ని ఏర్పాటు చేసుకొంటుందో అంతగానూ తనలోకి తాను చొచ్చుకుపోయి అన్నింటినీ ఒక క్షణంలో వదిలేసి ఉండగలదు కూడా. ఇందుకు కారణం ఒక్కటే భారతీయ జీవనం అయోమయం కాదు. బ్రహ్మమయం.

జీవితంలో ప్రతీ సందర్భాన్నీ పండుగగా మలచుకోవాలంటే, సృష్టిలో ప్రతి వస్తువులోనూ పరమాత్మను దర్శించాలంటే ఇక్కడ ప్రతి మనిషి నాలుగు పురుషార్ధాల సాధనకు కట్టుబడి ఉండాలి. అవే ధర్మ, అర్ధ, కామ, మోక్షాలు. వీటిని అదే వరుసలో సాధించాలి. తొందరపడి దూకకూడదు. నెమ్మదిగా నడిచి ఒక్కో మైలు రాయీ దాటాలి. అందుకు మనస్సును మన అదుపులో ఉంచుకోవడం చాలా ప్రధానం. ఇందుకు మన తెలుగు సాహిత్యంలో నాలుగు పద్యాలు మనకు దీపస్థంభాలుగా నిలిచి దారి చూపిస్తాయి.

మొదటి పురుషార్ధం ధర్మం. దాన్ని సాధించాలంటే మనిషి ఎంత స్థిరంగా ఒకే చోట నిష్ఠతో ఉండాలో, మనుచరిత్ర కావ్యంలో అల్లసాని పెద్దన చెబుతారు.

” అపురిబాయకుండు – మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి భా
షాపర శేషభోగి, వివిధాధ్వర నిర్మల ధర్మ కర్మ దీ
క్షాపరతంత్రు, డంబురుహగర్భ కులాభరణం, బనారతా
ధ్యాపన తత్పరుండు ప్రవరాఖ్యుడలేఖ్య తనూ విలాసుడై ”
– మనుచరిత్ర

ఇదంతా ప్రవరుని రూపగుణవర్ణన. ఇందులోనే ఆంధ్ర కవితా పితామహుడు ధర్మ పరుషార్ధ సాధనకు మార్గం చూపించాడు. ప్రవరుడు మన్మధుడంతటి సుందరాంగుడట. కాబట్టే ఆయన్ ఉన్న ఊరు విడిచిపెట్టి ఎక్కడికీ వెళ్ళలేదట. అంతటి అందగాడు ఇంటిని, ఇల్లాలిని విడిచిపెట్టకుండా ఉండటం ఆయ్న సంసారానికీ, ఇతరుల సంసారాలకు కూడా మంచిది. అనుకోని సరదాపుట్టి ఆయన హిమాలయలకు వెళితే జరిగిందేమిటో మనకు తెలుసు కదా! అలాగే ఆయన భాషా పాండిత్యంలో ఆదిశేషుడట. ఆదిశేషుడు కూడా ఉన్న చోటు నుండి కదలడు. ఆయన శ్రీమహావిష్ణువుకి స్థిరమైన శయ్య. ఆ ప్రవరుడు ఎన్నో ధర్మకర్మలు దీక్షగా చేస్తూ ఉండాడట. కాబట్టే ఆపురి బాయకుండా ఉండాలి. దీక్షపట్టిన వాళ్ళు ఇల్లు కదలరు కదా! ఆయన అంబరుహగర్భకులాభరణం ట. “అంబురుహం” అంటే పద్మం. అది చెరువులోంచి కదలదు. కదిలితే తెగిపడిపోవడాం ఖాయం. సరస్సులో ఉంటేనే దాని అందం. చూడదలచిన వాళ్ళు అక్కడికే వస్తారు. “అంబురుహ గర్భుడు” అంటే బ్రహ్మదేవుడు ఆయన ఇల్లు కదలడు. అటువంటి వంశంలో పుట్టాడు. కాబట్టే ప్రవరుడు కూడా ఊరు విడిచిపెట్టని పరమ నిష్ఠాగరిష్ఠుడు.
పైగా ఆయన “అనారత – అధ్యాపన – తత్పరుడు. అంటే ఎప్పుడూ విద్యార్ధులకు వేదపాఠాలు చెబుతూనే ఉంటాడు. అటువంటివాడు ఇల్లు విడిచిపెట్టడాం ఎలా వీలవుతుంది? అందుకే ఈ పద్యంలో ప్రవరుని లక్షణాలను తెలియజేయడానికి వాడిన ఉపమానాలన్నీ, విశేషణాలన్నీ, రూపకాలన్నీ కదలనివే.
ప్రవరుని సుస్థిరమైన ధర్మనిష్ఠను చిత్రించడానికి పెద్దన గారు స్థిరమైన వస్తువులనే, వ్యక్తులనే తీసుకొన్నారు. “ఆపురిబాయకుండ” అనే మాట మొదట చదివి వదిలైకుండా ప్రతి లక్షణం తరువాత..”కాబట్టి ఆపురిబాయకుండు” అని చదువుకుంటే పద్యం అన్వయం మరింత అందంగా ఉంటుంది. ప్రథమ పురుషార్ధమైన ధర్మాన్ని సాధించడాం అంటే నిశ్చలంగా నిశ్చయంగా స్వధర్మ నిర్వహణ చేయడమే. హిమాలయ యాత్ర పేరుమీద ఊరువాడ విడిచి ఉత్తరంగా ఎగిరిపోయిన ప్రవరుడు ఎదుర్కొన్న ఇబ్బందులూ, మానసిక క్షోభ మనం మనుచరిత్రలో చదువుకున్నాం. చివరికి అతన్ని క్షేమంగా ఇంటికి చేర్చింది కూడా అతని స్వధర్మ నిర్వహణే. బ్రాహ్మణుని ధర్మం నిత్యాగ్నిహోత్రం. ఆ అగ్నిహోత్రుడే అతన్ని హిమాలయాల నుండి ఇంటికి చేర్చాడు. అలాగే మనం అంతా సమాజంలో అస్తవ్యస్థ పరిస్థితులకు భయపడకుండా, ఆకర్షణలకు లొంగకుండా మన కర్తవ్యం మనం చేస్తే అదే మనల్ని రక్షిస్తుంది.

“ధర్మో రక్షతి రక్షిత:”

చతుర్విధ పురుషార్ధాలలో ధర్మం తరువాతది, ధర్మం చేత అదుపులో పెట్టబడవలసింది అర్ధం. అంటే ధనం. ధర్మం దీనికి మూలమై ఉండాలి. ధర్మం గానే ధనం సంపదించాలి. అధర్మంతో ఆర్జించిన విత్తం అనూహ్యంగా చేజారిపోతుంది. అర్ధపురుషార్ధం విషయంలో మనం మనస్సును ఎలా అదుపులో పెట్టుకోవాలో బమ్మెర పోతన భాగవతంలోని వామన్ చరిత్రలో వామనుని చేత చెప్పిస్తాడు.

“వ్యాప్తింజెందక వగయ్క
ప్రాప్తించిన లేశమైన్ పదివేలనుచున్
తృప్తిం జెందని మనుజుడు
సప్తద్వీపములనైన జక్కంబడునే”
– భాగవతం – వామన చరిత్ర

ధనం విషయంలో ఎప్పుడూ అసంతృప్తి పనికిరాదు. మరింత ప్రచారాన్ని (వ్యాప్తి) కోరుకోరాదు. లభించిన సొమ్మునే పదివేలుగా భావించి గలిగినవాడు లక్ష్మీ కటాక్షాన్ని సమృద్ధిగా పొందగలుగుతాడు. అటువంటి తృప్తిలేనివాడు సప్తద్వీపాల్లో పదునాలుగు లోకాల్లో ఎక్కడ తిరిగినా ఎన్ని స్వాధీనం చేసుకొన్నా సంతృప్తిని పొందలేడు. మొత్తం మీద ’ఇకచాలు’ అనుకుంటే తప్ప అర్ధ పురుషార్ధాన్ని సాధించి మన లక్ష్యానికి ఉపయోగపడేల చేసుకోలేం.

మూడవది మూలమైనది కామ పురుషార్ధం. నాలుగు పురుషార్ధాలలో ఇది చాలా విశిష్టమైనది. ఈ కామం పురుషార్ధాలలోనూ ఉంటుంది. అరిషడ్వర్గాల్లో కూడా ఉంటుంది. మానవుడు తప్పనిసరిగా సాధించవల్సిన వ్యతిరేకించవలసిన అరిషడ్వర్గాల్లోనూ (కామక్రోధలోభమోహమదమాత్సర్యాలు) కామం ఉండటం ఆశ్చర్యం కదూ! అదే వైదిక ధర్మంలో సూక్ష్మం తన జీవిత భాగస్వామి యందు కలిగిన కామవాంఛ పవిత్రమైన పురుషార్ధం. ఇతరులయందు కలిగిన కామవాంఛ భయంకరమైన శత్రువు. అందుకే ఈ కామాన్ని మొగ్గలోనే త్రుంచెయ్యాలి. ఎదగనీయకూడదు. ఇందుకు ఉదాహరణగా సారంగుతుమ్మయ్య రచించిన “వైజయంతీ విలాసం” కావ్యంలోని పద్యాన్ని పేర్కొనవచ్చు. ఆ కావ్యంలో పూజారియైన విప్రనారాయణుడుని వేశ్యయైన దేవదేవి లొంగదీసుకొందుకు వీర ప్రయత్నాలన్నీ చేస్తుంది. ఆ ప్రయత్నాలను మొదట్లోనే త్రుంచేస్తూ విప్రనారాయణుడు చక్కని మాట చెబుతాడు.

“కాకులు రావి పళ్ళు తిని గ్రక్క శిలామయదేవ మందిరా
నీకము నందు రావులు జనించును; సజ్జన చిత్తవృత్తి అ
వ్యాకులలీల రాతి గుడి వంటిది, లోకములోని వేశ్యలున్
కాకులుల వంటివారలటుగాన ప్రమాదము చేరనిచ్చినన్ ”

– వైజయంతీ విలాసం

సాధారణంగా గుడి ప్రక్కన రావిచెట్టు ఉంటుంది. దాని పుట్టుక చాలా విచిత్రం. గుడికి ప్రహారీగోడ పెద్దదే ఉంటుంది గదా! ఆ గోడప్రక్క రావి చెట్టు మీద వాలిన కాకులు రావిపళ్ళు గోడమీద పెట్టుకుని తింటాయి. అలా తినడంలో కొన్ని గింజలు గోడమీద చెదురుమదురుగా ఉండిపోతాయి. ఆ గింజలు ఆ ప్రహారిగోడకుండే సన్నని బీటల్లో చేరుతాయి. ఆ పైన ఎప్పుడో వర్షం కురుస్తుంది. ఆ పగుళ్ళలో నీళ్ళు చేరతాయి. దాంతో ఆ గింజలు మొలకెత్తే గోడలో రావి మొక్కలు మొదలై క్రమంగా ఎదిగి అంత పెద్ద ప్రహారీగోడని చీల్చేస్తాయి.
గింజల కోసం వాలిన కాకులు ఇంతటి నష్టం కలిగిస్తాయని రాతికీ తెలియదు. గుడికీ తెలియదు. గుడిలో స్వామికి తెలిసినా మానవుల అజాగ్రత్తకు ఆయన ముసి ముసి నవ్వులు నవ్వుకొని ఊరుకొంటాడు.

అదే విధంగా మంచివారి మనస్సు రాతిగోడ లాంటిదట. వేశ్యలు, పరస్త్రీలు కాకుల వంటివారట. వీళ్ళు నెమ్మది నెమ్మదిగా తమ వెర్రి మాటలు, వెకిలి చూపులు అనే గింజలు సజ్జనుల మనస్సులో నాటుతూ ఉంటారు. సజ్జనులు మొదట్లో మనల్ని అవేం చేస్తాయిలే అని అశ్రద్ధ చేస్తే, అవి నాటుకొనే అవకాశం ఇస్తే ఆ వెర్రి మాటలూ, వెకిలి చేష్టలే మనస్సులో కామరూపమహావృక్షాలై వారి జీవితాన్ని నిలువునా దోచేస్తాయి. అందువల్ల ముందునుంచే అటివంటి వారికి దూరంగా ఉండటం చాలా మంచిదని విప్రనారాయణుడు దేవదేవికి కఠినంగా సమాధానం చెప్పాడు. ఇంతా చెప్పిన పెద్దమనిషిని చివరకు ఆవిడ వలలో ఎలా పడిపోయాడనేది ఆయన గ్రహస్థితికి సంబంధించిన విషయం మన్ పరిస్థితికి మనం పద్యంలో ఉండే సూక్ష్మం గ్రహించి కమం విషయంలో ఎక్కడ పురుషార్ధమో, ఎక్కడ పరమశత్రువో గ్రహించి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది.

ఇక నాలుగవ పురుషార్ధం మోక్షం. ఇది సాధించాలంటే జీవితంలో మన పాత్రకు మనం పరిమితం కావాలి. అంతేగాని అతిగా రాసుకోవడాం పూసుకోవడాం పనికిరాదు. ఆ రకమైన పాత్రధారణ ఎలా చెయ్యాలో కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి గారి పద్యరత్నం తెలియజేస్తుంది.

“వేషము వేసి పంపితివి వేదికమీదకు, పాడువేళన
మీసము లూడిపోయి విషమించె పరిస్థితి; ప్రేక్షకుల్ పరీ
హాసము చేయుచుండిరి; రహస్యముగా తెరవేయుమంచు నీ
కోసము చూడగా కసరుకొంటి విదెక్కడి దర్శకత్వమో!”

ఈ పద్యం నాటకంలో నటుడికి జీవితంలో మనకు శ్లేష సాధిస్తోంది. దుర్యోధనుడి పాత్రలో గంభీరంగా నటించే నటుడొకరు పద్యం పాడేటప్పుడు అనవసరంగా మీసాలు పదేపదే మెలివేసేసరికి అవి కాస్తా ఊడిపడ్డాయి. ప్రేక్షకులు గొల్లున నవ్వసాగారు. చేసిన తప్పు దిద్దుకోవడానికి ఒకసారి తెరదించమని దర్శకుణ్ణి కోరితే కస్సుమని తారామండలం స్థాయిలో లేచాడట. అతిగా ఎందుకు చేశావని. జీవులమైన మనందరి పరిస్థితి ఇంతే. భగవంతుడనే దర్శకుడు అందరికీ తలోపాత్ర ఇచ్చి కొద్దిసేపు ఈ ప్రపంచ నాటక రంగస్థలం మీద నటించండ్ర అంటే అందరం మన పరిమితిని మరిచిపోయి ఎక్కడలేని పెత్తనాలు చేసేసి పీకల మీదకి తెచ్చుకొని ఎలా పరిష్కరించుకోవాలో తెలియక జీవితానికి తెరదించేయమని ఏడుకొండలవాడి దగ్గర ఏడుస్తున్నాం. అలా కాకుండా నిర్మలంగా, నిరహంకారంగా మన బాధ్యతలు మనం నిర్వర్తిస్తే పరిస్థితి అంతవరకూ రాదు. అదీ ఈ పద్యం ద్వారా మోక్ష పురుషార్ధాన్ని సాధించడానికి గ్రహించవలసిన అంతరార్ధం. తెలుగు పద్యాల్లో ఇంతటి ఆధ్యాత్మిక శక్తి ఉంది. అందుకే పాల్కురికి సోమన ” తెలుగు మాటలనంగ వలదు, వేదములు కొలదియగా చూడండి” అని పేర్కొన్నారు.