కీర్తనం-ఆనంద లహరి

శ్రవణం, కీర్తనం, స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం..

అనే తొమ్మిది రకాల భక్తి మార్గాలలో కీర్తనం వరసకు ద్వితీయమైనా వాసికి అద్వితీయం. మిగిలిన ఎనిమిది రకాల మార్గాల్లో పనిసాగుతున్నా మనస్సు లీనమవుతోందో లేదో తెలియదు. కానీ కీర్తనంలో ఉండే గానధర్మం వల్ల మనస్సు సహజంగానే ఆకర్షింపబడుతుంది. ఆ స్థితి కూడా లేని మందభాగ్యులకి కనీసం కొంతసేపు సత్కాలక్షేపం చేశామన్న సంతృప్తి అయినా మిగులుతుంది.

భగవత్సంకీర్తనలో ప్రథమాచార్యునిగా కీర్తించబడే నారదుడు నారాయణ నామ స్మరణలో పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. ఆ సంకీర్తన ఆయనకి మూడు లోకాల్లో ఏడువాడలూ తిరిగే సామర్ధ్యాన్ని ఇచ్చింది. ఆ తరువాత అంతటివాడు, తనకు తెలియకుండానే నారదునికి శిష్యుడైన వాడు ప్రహ్లాదుడు. ఈయన గురువును మించిన శిష్యుడు. నారదుడు సంతోషంగా ఉండి సంకీర్తన చేస్తే ఈయన సంక్షోభంలో కూడా అదేపని అంత ఆనందంగా చేశాడు.

తన్ను నిశాచరుల్ పొడువ దైత్యకుమారుడు మాటిమాటికి పన్నగశాయి! యోదనుజ భంజన! యో జగదీశ! యో మహాపన శరణ్య! యో నిఖిల పావన యంచును తించుగాని తా, గన్నుల నీరు దే డు భయకంప సమేతు డు కాడు భూవరా!

హిరణ్యకశిపుని ఆజ్ఞ ప్రకారం రాక్షస్ భటులు భయంకరంగా హింసిస్తుంటే ప్రహ్లాదుడు చేసిన పని ఈ సంకీర్తనే. బాధలను భరిస్తూ భగవద్గుణ గణ గానం చేశాడే కానీ దీనంగా ఏడుస్తూ కూర్చోలేదని పోతన గారు మనకి సందేశం ఇస్తున్నారు. మనోవేదనకు మందు లేదు అంటారు కానీ మనం ఒక నిశ్చయానికి రాగలిగితే మనో వేదనని మరిచిపోవచ్చు. కానీ శరీర బాధ అలాంటిది కాదు. మనం తీసేద్దామంటే పోదు. దాని సమయం అది తీసుకుని క్రమంగా తగ్గుతుంది. అంతటి భయంకరమైన హింసని అనుభవిస్తూ ప్రహ్లాదుడు భగవత్కీర్తన మాన లేదంటే ఆ కీర్తన అతనికి ఎంత బలాన్ని ఇచ్చిందో తెలుస్తోంది. మనకైనా అంతే.

భారతకాలంలో కేవల సంకీర్తన ద్వారా సంతాప సమయాలను కూడా సమర్ధంగా ఎదుర్కోగలిగిన ధీరభక్తురాలు స్వయంగా భగవంతునికి మేనత్త అయిన కుంతి.

శ్రీ కృష్ణా! యదుభూషణా! నరసఖా! శృంగార రత్నాకరా! లోకద్రోహి నరేంద్రవంశదమనా! లోకావనా! దేఅతానీక బ్రాహ్మణ గోగణార్తి హరణా! నిర్వాణ సంధాయకా! నీకున్ మ్రొక్కెద ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ!

నిరంతరం కుంతి యిటువంటి సంకీర్తనతో కాలం గడిపేదని పోతన గారు భాగవతంలో చెప్పారు. ఇందులో భగవంతునికి భక్తుడు క్రమక్రమంగా దగ్గరయ్యే విధానం కనబడుతుంది. ముందు పేరుతో పిలవడాం, అనంతరం మా పుట్టింటి వారింటి మాణిక్యమా (యదుభూషణా) అనడం, తర్వాత మా అబ్బాయుఇకి మరో ప్రణమా (నరసఖా) అనడం - ఇవన్నీ క్రమక్రమంగా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని ఆత్మీయం చేసుకునే విధానాలు. భగవంతుని బంధువుగానే కాకుండా ఆత్మబంధువుగా భావించించి కాబట్టే ఆ మహాసాధ్వి అప్పుడప్పుడూ ఆపదలు వచ్చేలా చూడమని (విపదః సంతునః) ధైర్యంగా కోరగలిగింది. ఆపదల్లోనే మనం ఆయన్ని ప్రార్ధిస్తామనే బలహీనతని అర్ధం చేసుకొని మనందరి పక్షాన కుంతి దేవదేవుని ఆ కోరిక కోరింది.

కీర్తన ఫలం గురించి తెలుసుకోవాలంటే ఆముక్తమాల్యదలో మాలదాసరి కథ తెలుసుకోవాల్సిందే. ప్రమాదవశాత్తు రాక్షసుని బారిన పడ్డ దాసరి నారాయణుని ఆలయం ముందు చివరికీర్తన పడి మళ్ళీ వచ్చి ఆహారంగా తనని తాను సమర్పించుకొంటానని వాగ్దానం చేసి వెళ్ళి, చెప్పిన సమయానికి తిరిగివచ్చి మాట నిలబెట్టుకుంటాడు. ప్రాణం పోతున్నా సరే మాట తప్పకుండా ఉండేంత గుండెబలం భారతీయులకి, అందునా భక్తులకే సాధ్యమేమో! వచ్చిన దాసరిని చూసి పశ్చాత్తప్తుడైన బ్రహ్మరాక్షుసునికి కళ్ళు తెరుచుకొని ఆ ప్రభాత కీర్తన ఫలం తనకు ధారపొయ్యమంటాడు. కీర్తనవ విలువ అనంతమని తెలిసినా దయాగుణంతో ధారపోసిన దాసరి ఔదార్యం వల్ల అతనిలోని రాక్షసత్వం పోయి బ్రహ్మత్వం మిగులుతుంది అదీ హరినామసంకీర్తన ఫలం.

అష్టదిగ్గజాల్లో ఒకడైన ధూర్జటి తన శ్రీకాళహస్తీశ్వర శతకంలో శివనామ సంకీర్తన అసాధ్యాలను సుసాధ్యాలుగా చేస్తుందని నిరూపించాడు.

పవి పుష్పంబగు, నగ్నిమంచగు, నకూపారంబు భూమీ స్థలంబవు, శత్రుండతి మిత్రుడౌ, విషము దివ్యాహారమౌ నెనగా నవనీ మండలి లోపలన్ శివశివేత్యాభాషణోల్లాసికిన్ శివ! నీ నామము సర్వ వశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వరా!

శివనామ సంకీర్తన నిరంతర చేస్తూ ఉండే వారి మీద పిడుగులు పడితే అవి పూలుగా మారిపోతాయి. వారి ఇంటి కంటుకొన నిప్పు మంచుగా మారిపోతుంది. వారు ప్రమాదవశాతు సముద్రంలో జారిపడితే వారికోసం ఒక ద్వీపం అప్పటికప్పుడు, అక్కడికక్కడే రూపొందుతుంది. వారి శతృవులు వారింటి ముందుకు వచ్చి స్నేహహస్తం చాపుతారు. వారి మీద ఎవరైనా విష ప్రయోగం చేస్తే అది వారికి పోషకాహారం అవుతుంది. వీటన్నింటికీ ఉదాహరణలు పురాణకాలంలోనే కాదు, నవీన కాలంలోనూ దొరుకుతాయి.

నవీనకాలంలో మనకంటే ముందుతరంలో సంకీర్తన వల్ల మహాయోగం పొందిన నాదయోగి త్యాగరాజు.

"రాగము రామపాదమనురాగము జానకి కాలి అందెలన్ మ్రోగెడి దివ్యనాద, మనుమోదిత తాళము వాయునందనుండేగిన సాగరోర్మికల నెంతయునూపెడి మిశ్రచాపమై త్యాగయ పాడె సత్కృతులు ధారుణి తెల్గుల వెల్గు నింపుచున్" - (సాగరఘోష)

త్యాగరాజ స్వామి సత్కారాల కోసం, పురస్కారాల కోసం, పద్మభూషణాల కోసం కీర్తనలు పాడలేదు. ఆయన కీర్తనల్లో రాగం రామునిపాదం. ఆర్ధ్రత సీతామహాసాధ్వి పాదమంజీర ధ్వని. మారుతి తరించిన మహాసాగర పాటకుతాళం. అంతిమ లక్ష్యం ఆత్మానందమని త్యాగరాజు తన కీర్తనల ద్వారా సంగీత సహిత్యవేత్తలకు సలహా ఇచ్చాడు. పాటించడం పాటించకపోవడం మన సంస్కారస్థాయికి సంబంధించిన విషయం.

చివరగా ఒక చమత్కారం "రామ" అనే శబ్దాని తెలిసి పలికినా తెలియక పలికినా ఎటువంటి పలుకుల్లో భాగంగా పలికినా అవి జీడిపప్పు పలుకులై ముక్తి సుగంధాన్ని మనస్సుకి అందిస్తాయట. ఒకానొక అరణ్యంలో వేటాడుతూ తిరుగుతున కిరాతుల్ని ఎవరు ప్రశ్నించినా వారు వారి దినచర్యను ఈ విధంగా వివరిస్తునారట.

వనే చరామః వసుచాహరామః

నదీ స్తరామః న భయం స్మరామః

ఇతీరయంతో విపినే కిరాతాః

ముక్తింగతా రామపదానుషంగాః

మేం అడవుల్లో తిరుగుతూ ఉంటాఅ(చరామః) జంతువుల్ని (ఆహరామః), నదీ నదాలు సులువుగా దాటేస్తూ ఉంటాం(తరామః). భయం మా మనస్సులోకే రాదు (న స్మరామః)," అంటూ ఉంటే అనుకోకుండా ఆ మాటల్లో రామః రామః అని పలుమార్లు రావడం వల్ల రామసంకీర్తన చేసిన ఫలం లభించి వారి మోక్షం పొందగలిగారట. ఎంత చమత్కారం లీలా మానుష వేషధారియైన భగవంతుని దృష్టిలో ఈ సృష్టియే ఒక పెద్ద చమత్కారం.

అంత శక్తి గల్గిన భగవన్నామ సంకీర్తనతో జీవుడు ఆనందలహరిగా మారి ఆత్మానంద మహా సాగరంలో లీనం కావడమే జీవన పరమార్దం.


తెలుగు తోటలో పండిన విక్రమకేళి - వైకుంఠపాళి

కేవలం నాలుగు గవ్వలతో మూడో నాలుగో చింత పిక్కలతో (ఆడేవాళ్ళ సంఖ్యను బట్టి) జీవితాన్ని ఆస్వాదించగలిగే, అనుభవించగలిగే, ఎదిరించగలిగే ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చే ఈ ఆట తెలుగు వారి సృష్టి. తెలుగు సంస్కృతిలో పుత్రకామేష్టి.

ఇందులో 11 వరుసలుంటాయి. ఒక్కో వరుసలో 11 గడులుంటాయి. మొత్తం 121 గడులు పూర్తయ్యాక 11 గడులలో ‘పరమపదసోపానపటము’ అక్షరాలు రాసి ఉంటాయి. ఆ పైన “ధరసింహాసనమైనభంబు గొడుగై తద్దేవత భృతులై...సిరిభార్యామణియై” అన్నట్లుగా పదిమంది దివ్య పురుషుల మధ్యలో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు. చివరకు చేరుకోవల్సిన స్థానం అది. అక్కడకు చేరుకొనే వరకు (జీవితమనే) ఆట ఆడుతూ ఉండవలసిందే. ఈలోగా ఒకటి నుంచి 121 వరకు ఎక్కుతూ దిగుతూనే ఉండాలి. పడుతూ లేస్తూనే ఉండాలి. అంటే పరమపదాన్ని చేరుకునే వరకు ఈ జనన మరణ సంసార చక్రంలో పడుతూ లేస్తూ ఉండటం తప్పదని హెచ్చరిక.

పదకొండు అంటే సంస్కృతంలో ఏకాదశి. ఏకాదశీవ్రతం భారతీయులందరికీ ఆచరణీయం. ఏకాదశి మహా పర్వదినం. ఆ రోజు ఉపవాశం, జాగరణ, దైవస్మరణం అనే మూడూ తప్పని సరి. అలా 11 ఏళ్ళు వరుసగా ఏకాదశీ వ్రతం చేస్తే పరమపదం చేరుకోవచ్చనేది పురాణ కథనం. అయితే ఇదంతా ఆధ్యాత్మికం.

గెలుపోటములు మానసికానుభూతులు. పరమపదం చేరుకోవడం ఆధ్యాత్మిక పరమార్ధం. ఇదొక రకంగా అరచేతిలో వైకుంఠం. ఇందులో గొప్ప వ్యక్తిత్వ వికాస సూత్రాలున్నాయి. నీ ఉన్నతి నీ చేతిలోనే ఉందని చెప్పడం. గవ్వలతో గెలవగలవని జీవితం కోసం ‘రవ్వ’ పెట్టుకోవద్దని ఉపదేశం.

ఇందులో చాలా గళ్ళలో ఏదో ఒక బొమ్మ, దానికో పేరు కచ్చితంగా ఉంటాయి. కొన్ని గళ్ళు అడ్డంగా దాటేస్తూ నిచ్చెనలు ఊరిస్తాయి. కొన్ని గళ్ళు అమాంతం దించేస్తూ ఉంటాయి. అంతలో ఉత్సాహం అంతలోనే నిరుత్సాహం. అంతిమంగా ద్వంద్వాతీతమైన పరమశాంతి. ఇదీ ఆట నడిచేతీరు.

ఈ ఆటలో పాములు, నిచ్చెనల గడుల్లోని పేర్లను నిశితంగా పరిశీలిస్తే అద్భుత రహస్యాలు కనిపిస్తాయి. ఉదాహరణకు 75వ గడిలో ఒక పాము తల దగ్గర కరోటకుడు అని రాసి ఉంటుంది. దాని తోక 10వ గడిలోకి పాకుతుంది. అక్కడ పంది బొమ్మ ఉంటుంది. పాము కరవడం వల్ల కిందికి రావడం అనేది పైకి కనిపించే విషయం. జీవితంలో కర్కోటకంగా వ్యవహరిస్తే వచ్చే జన్మలో పందైపుడతావనేది ఆధ్యాత్మిక హెచ్చరిక. పందిలా హీనంగా చూస్తారనేది వ్యక్తిత్వ పాఠం.

అలాగే 55వ గడిలో ఒక పాము తల ఉండి దుర్యోధనుడు అని రాసి ఉంటుంది. దాని తోక 12 వ గడిలోకి పాకుతుంది. 43 గడులు కిందికి జారిపోవడం పైకి కనిపించే ఓటమి. దుర్యోధనుడు అసూయకు ప్రతిరూపం. దాని వల్లే కురు వంశ క్షయం. అలానే... మనమూ అసూయపడితే జీవితం నరకప్రాయమవుతుందని, సుఖ శాంతులు నశిస్తాయని హెచ్చరిక.

పాముల అమరిక ఇంత అర్ధవంతంగా ఉంటే నిచ్చెనల ఏర్పాటు మరింత పరమార్ధ బోధకంగా ఉంటుంది. 63వ గడిలో ఒక నిచ్చెన అడుగు భాగం ఉంటుంది. అక్కడ భక్తి అని రాసి ఉంటుంది. ఒక భక్తుని బొమ్మ ఉంటుంది. దాని కొస 83వ గడి వరకూ సాగుతుంది. అక్కడ బ్రహ్మలోకం అని రాసి ఉంటుంది. బ్రహ్మదేవుని చిత్రం ఉంటుంది. భక్తిగా ఉండటమే బ్రహ్మలోకానికి చేరే ఉపాయమన్నది పరమైతే..ఏ పనైనా దాని మీద భక్తితో చేస్తేనే మంచి ఫలితాలొస్తాయన్నది ఇహం.

అలాగే 65వ గడిలో ఒక నిచ్చెన మొదలు ఉంటుంది. అక్కడ చిత్తశుద్ధి అని ఉంటుంది. దాని కొస 105వ గడిలో ఉంటుంది. అక్కడ మహాలోకం అని ఉంటుంది. మొత్తం వైకుంఠపాళిలో ఇదే పెద్ద నిచ్చెన. 40 గడులు అమాంతం ఎగబాకవచ్చు. ఇదంతా పైకి ఆశ పెటే విధానం. చిత్తశుద్ధి ఉంటే మహాలోకాలు నీకోసం ఎదురుచూస్తూ ఉంటాయని అంతరార్ధం. లోకంలో మహానుభావుడిగా కీర్తిపొందుతారని విశేషార్ధం. ఏ చిత్తశుద్ధి కొరవడటం వల్ల ఇవాళ దేశం అవినీతి ఊబిలో కూరుకుపోయిందో అటువంటి చిత్తశుద్ధి ప్రాధాన్యాని చిన్నతనంలోనే పిల్లలకు ఆటల రూపంలో నేర్పిన ఏకైక జాతి మన తెలుగుజాతి.

ఇంత గొప్ప విషయాన్ని చెబుతూనే చెంతనే పొంచి ఉన్న ముప్పును గుర్తించి జాగ్రత్త పడమనడం ఈ ఆట ప్రత్యేకత. సాధారణంగా 105వ గడి వరకు రాగానే ఆటగాడికి కొంచెం గర్వం వస్తుంది. ఇంక 16 గడులు దాటితే పండిపోయినట్లే కదా అనుకుంటాడు. అక్కడే ఎదురవుతుంది పెద్ద ప్రమాదం. 106వ గడిలో అరుకాషుడు అనే అతి పెద్ద సర్పం ఉంటుంది. దాని నోట్లో పడితే అమాంతం కిందికి జారి మొదటి గడిలోకి అంటే కోతి లోకి వచ్చి పడతాడు. అంటే ప్రముఖుణ్ణి (సెలబ్రిటీ) అయ్యాను కదా అని గర్వించి ఒక్క పొరపాటు (ఒకటి వెయ్యడం)చేసినా మళ్ళీ ఆట మొదటికి రావడం ఖాయం అని హెచ్చరించడం అన్నమాట. పైగా వైకుంఠపాళి పరిభాషలో ఒకటిని గుడ్డి అంటారు. అంటే ఎంత పెద్ద స్థానంలో ఉన్నా గర్వించి ఒక్క గుడ్డి పనిచేసినా మళ్ళీ కిందకి జారిపోవడం తప్పదని చెప్పడం.

ఇంత జరిగినా ఆట మానకూడని పరిస్థితి ఇందులో విచిత్రమైన విషయం. ఒకడు పెద్దపాము నోట్లో పడినా ఇంకొకడు ఇంకా పడలేదు కాబట్టి అతను ఇతన్ని ఆడమని ప్రోత్సహిస్తాడు. ప్రత్యర్ధిని సైతం బాగా ఆడమని ప్రోత్సహించే ఏకైక క్రీడ బహుశా వైకుంఠపాళీయే నేమో!

ఇంతకీ చివిరిదైనా చిన్నది కాని విషయం మరొకటుంది. చివర 121 వ గడిలో కూడా ఒక పాము ఉంటుంది. దానిపేరు అహంకారం. దానితోక 99 వ గడిలోకి ఉంటుంది. అంటే 106 లో అరుకాషుణ్ణి దాటినా, 115లో వైకుంఠంలో ప్రవేశించినా, 117లో కైలాసంలో దివ్యానుభూతి పొందినా చివరలో 121 లో అహంకారానికి లోనయితే తిరిగి రాక్షస జన్మ తప్పదు అని హెచ్చరిక. బ్రహ్మరుద్రాది దేవతల్ని తపస్సులతో ప్రసన్నం చేసుకొని మహాభోగాలు అనుభవించి లోకాలన్నీ జయించిన హిరణ్యకశిప, రావణాసురాది వీరులు చివరకు రాక్షసులై దుర్మరణం పాలుకావడానికి ఈ అహంకారమే కారణం కదా!

అంతిమంగా అహంకారం, మమకారం అనే రెండిటినీ జయించినవాడే పరమపదం చేరుకోగలడని సారాంశం.

జీవితమే ఒక వైకుంఠపాళి
నిజం తెలుసుకో భాయి!
ఎగరేసే నిచ్చెనలే కాదు
పడదోసే పాములు ఉంటాయి
చిరునవ్వులతో విషవలయాలను
ఛేదించి ముందుకు పోవోయి.

ఈ చలనచిత్రగీతం ఒక ప్రాచీన శ్లోకంలా, ఒక ప్రబంధ పద్యంలా, ఒక భావకవితలా, ఒక అభ్యుదయ గేయంలా ఎప్పుడూ తెలుగువారి చెవుల్లో మారుమోగుతూ గెలుపుకోసం వెన్ను తడుతూనే ఉంటుంది.


అర్ష ధర్మాల్లో అభ్యుదయ భావన

నిరంతర పరిణామ శీలమైన ఈ సృష్టిలో అభ్యుదయ భావన అనంతంగా ఉంది. మొదటి నుండి మానవుడు తానున్న స్థితి నుండి ఉనత స్థితిని పొందడానికి, అభ్యుదయాన్ని అందుకోవడానికి తీరని ఆరాటంతో ఆరని పోరాటం చేచ్తూనే ఉన్నాడు. ఆ అభ్యుదయ భావ కుసుమాల వికాసానికి అడ్డు తగిలే ప్రతీపశక్తుల ప్రతాపాన్ని యథాశక్తిగా ఎదిరిస్తూనే ఉన్నాడు.

ఋషుల పంథాలో, రోమన్ గ్రంథాల్లో ప్రాచ్యుల భావనా లోకంలో, పాశ్చాత్యుల పరిశోధనా లోకంలో పక్షపాతం లేకుండా పరిశీలించగల్గితే ఈ అభ్యుదయ భావన నిరంతర స్రవంతిగా ప్రవహిస్తూనే ఉందని తెలుస్తుంది. ఆదిఋషుల సుభాషితాల్లో అభ్యుదయ భావాలను ఒకింత పరిశీలిద్దాం.

ఆది దైవంగా భావించబడే శ్రీరాముడు ఆది కావ్యంలో మానవ ప్రత్యత్నానికిచ్చిన ప్రాధాన్యాని చూడండి:
దైవం పురుషకారేణ
య స్సమర్ధః ప్రబాధితుం!
న దైవేన విపనార్ధ:
పురుషస్సో వ సీదతి

ధృడతరమైన ప్రయత్నం చేత ఎవరు అదృష్టాని దెబ్బతీయగల్గుతారో వారు ఎన్నడూ విపన్నులు కారని తెలిపే ఈ శ్లోకం ఆర్షధర్మంలో పరుష ప్రత్యత్నానికుండే ప్రాధాన్యాని అద్దం పట్టి చూపిస్తోంది.

కులాల సంకుల సమరంతో పాప పంకిలమైపోయిన సమాజానికి కులాల నిష్ప్రయోజకత్వాన్ని ఆర్షధర్మం ఎంత సూటిగా తెలియజేస్తోందో చూడండి.

కిం కులేన విశాలేన
శీల మేవాత్ర కారణం!
కృమయః కిం న జాయుతే
కుసుమేషు సుగందిషు||

సుగంధబంధురాలైన సుమ సముదాయం నుండి దుర్గంధ కారకాలైన పురుగులు పుట్టడం లేదా? కులం ప్రధానమా, గుణం ప్రధానం కాని! అని ఈ శ్లోకం ఎలుగెత్తి చాటుతుంటే ప్రాచీన సంస్కృతి అంతా కులమతాలతో పాచిపట్టిందేనని మనం గొంతు చించుకోవడం ఎందుకు?

కోట్లకు కోట్లు సంపాదించి, ప్రజాహిత కార్యక్రమాలకు వెచ్చించకుండా దాచి, దోచే దోపిడీ దారులకు నేటి సమాజం విధించే శిక్షలు చాలా తక్కువ. ఆర్షధర్మం ఈ దోపిడీ గాళ్ళని ఏం చేయమని ఆజ్ఞాపించిందో చూడండి..

ద్వావంభసి నివేష్టవ్యౌ
గళేబుధ్వా శిలాందృఢాం|
ధనవంతమదాతారాం
దరిద్రంచా తపస్వినం||

ధనవంతుడై యుండి తన సొమ్మును బహుజన సుఖం కోసం బహుజన హితం కోసం ఖర్చుపెట్టని వాణ్ణి వెంటనే లోతైన బావిలోకి తోసైమన్నారు. మామూలుగా కాదు. మెడకి ఒక పెద్ద బండరాయి కట్టి మరీ తోసైమన్నారు. ఎందుకు? మల్ళీ లేచివచ్చి జనాన్ని ముంచకుండాను. దరిద్రుడైయుండి సంపాదించడానికి కష్టపడని వాడికి కూడా ఇదే శిక్ష. ఎంత తీవ్రవాదం! ఎంత ఆవేశం! దాని వెనుక ఎంత ఆవేదన! ఎంత సామాజిక స్పృహ! ఇటువంటి శ్లోకాలు చదువుతుంటే అసలీ ఋషులు కంటె అభ్యుదయ వాదులు విప్లవ కారులు వేరే ఉన్నారా! అనిపిస్తుంది.

సమాజానికి నువ్వు ఇవ్వగలిగింది ఇయ్యి. నీకు అవసరమైంది తీసుకో అన్నాడు సామ్యవాద ప్రవక్త మార్క్స్. ఇది ఒక్కటి మనమంతా ఆచరిస్తే సమసమాజం రేపీపాటికి ఏర్పడిపోతుందనడంలో సందేహం లేదు. కానీ మనం మార్క్సు చెప్పిందీ చెయ్యం. మహర్షులు చెప్పిందీ చెయ్యం. కొందరు మార్క్శుని, మరికొందరు మహర్షులని తిట్టుకుంటూ పరస్పరం కొట్టుకుంటూ కాలక్షేపం చేసేసి కర్తవ్యాన్ని భావితరాల వారికి బోధిస్తూ ఉంటాం. మార్క్స్ భావనలను మహర్షులు ఎంతో కాలం ముందుగానే ఎంత కచ్చితంగా ప్రకటించారో చూడండి..

యావద్భ్హ్రియేత జఠరం
తావత్ స్వత్వంహి దేహినాం|
అధికం యో భిమన్యేత
సస్తేనో దండమర్హతి||

కడుపు ఎంతవరకూ పడుతుందో అంతవరకే సొంతం. ఆ అవసరాల మేరకే దాచుకోవాలి. అంతకంటె నయాపైసా అధికంగా దాచినా వాడు దొంగే అవుతాడు. వాణ్ణి దండించి తీరవలసిందే! నీకవసరమైనంత వరకే తీసుకో.. అన మార్క్స్ భావనకి దీనికి తేడా ఏమిటి?

దీన్ని లోతుగా విచారించి (ఆలోచించి) ఆచరించి, ప్రచారం చేస్తే సమసమాజం కోసం రక్తపుటేరులు ప్రవహించవలసిన అవసరం లేదు. ఆ చిత్తశుద్ధి, నిజాయితీ, ఆదర్శం లేనినాడు దాడులు, ఎదురుదాడులు వర్గ సంఘర్షణలు తప్పవు మరి.

అభ్యుదయ భావన అనాదిగా, అనంతంగా పెనవేసుకుని వస్తూనే ఉంది. ఆచరించే వాళ్ళ కోసం అప్పటినుండి ఇప్పటి వరకు ఆశగా ఎదురుచూస్తూనే ఉంది. ఆ ఆశలు నెరవేర్చడానికి మహర్షులూ రారు, మార్క్సూ రాడు. నెరవేర్చినా, పరిమార్చినా మనమ


నడకలోనే పద్యం నడక

తెలుగు పద్యానికి ప్రపంచ సాహిత్యంలోనే ప్రత్యేక స్థానం ఉంది. ఆ ప్రత్యేకతలో సగభాగం దాని నడకలోనే ఉంది. ఆ నడక అందంగా ఉండాలంటే కవి పద్య నిర్మాణం పట్ల శ్రద్ద వహించాలి. అటువంటి శ్రద్దాయుతమైన పద్య నిర్మాణం ఎలా ఉంటుందో పోతన గారి భాగవతంలోని "వామన చరిత్ర" ఘట్టంలో చూద్దాం.

బుజ్జి వామనుడు బలి చక్రవర్తి సభామండపంలోకి ప్రవేశించాడు. కొందరు ఆశ్చర్యంగా, కొందరు ఆనందంగా, ఇంకొందరు అసూయగా చూస్తూ ఉండగా ఆ బాలుడు అడుగులో అడుగు వేసుకుంటూ నడచి వస్తున్నాడు. ఆ నడకల్ని పోతన ఎంత శాస్త్రీయంగా, మనో విశ్లేషణాత్మకంగా వర్ణించాడో చూడండి.

"వెడ వెడ నడకలు నడచుచు
నెడ నెడ నడుగులకు నడరి యిల దిగబడగా
బుడి బుడి నొడువులు నొడవుచు
జడిముడి తడబడగ వడుగు చేరెన్ రాజున్"

వామనుడు పసిబాలుడు. కాబట్టి తప్పడగులు వేయడం సహజం. అందుకే ’వెడవెడ నడకలు’ అనే ప్రయోగం. నడుస్తూ ఉంటే పడిపోతానేమో అనే భయంతో నడవడం బాలుని నైజం. ఇక్కడ తల్లి దగ్గరకు చేరుకునే పసిబాలుని నడకను మనం ఊహించుకోవాలి. నడక నేర్పేడప్పుడు కొంచెం దూరంగా నిలబడి దగ్గరకు రమ్మని పిల్లవాడిని ప్రోత్సహిస్తూ ఉంటుంది. అతడు దగ్గరకు వస్తున్న కొద్దీ తాను కొంచెం దూరం జరుగుతూ పిల్లాణ్ణి మళ్ళీ మళ్ళీ రమ్మని పిలుస్తూ వాడు పడిబోతుంటే దగ్గరకు వెళ్ళి పట్టుకోబోతున్న భద్రతా భావాన్ని కల్స్పిస్తూ చివరికి దగ్గరకు వచ్చే సమయానికి తన చేత్తో అందుకోబోతున్నట్లు నటిస్తూ గొప్ప శిక్షణనిస్తుంది. ఈ వాతావరణమంతా ఈ చిన్న పద్యంలో ఇమిడ్చాడు పోతన్న. ’ఎడనెడ నడుగులు’ అటూ యిటూ వేసే తప్పటడుగులన్నమాట. ’అడరి ఇల దిగబడగ’ అంటే ఆ బాలుడు భూమి మీద జారిపోతున్నాడేమో అనీ చెప్పుకోవచ్చు. ఆ బాలుడు సాక్షాత్తూ విష్ణుమూర్తి కాబట్టి ఆయన అడుగుల భారానికి భూమి దిగబడిపోయేలా ఉందనీ చెప్పుకోవచ్చు. ’ఇల’ అనే శబ్ధం తరువాత ద్రుతం లోపించిందనుకుంటే ఈ రెండు అర్ధాలు సరిపోతాయి. ఇంతకు మించిన విశేషం మరొకటుంది.

ఇది ఇంచుమించుగా సర్వలఘుకందం. తప్పనిసరి కాబట్టి రెండవ, నాల్గవ పాదాల చివర గురువుంది. కానీ వాటితో పాటు నాల్గవ పాదం చివరలో ’చేరెన్ రాజున్’ అంటూ నాలుగు గురువులు వేశాడు. అన్నీ లఘువులే వేసిన పద్యంలో చివరలో అకస్మాత్తుగా నాల్గవ గురువెందుకు?. తల్లిని చేరుకోడానికి ప్రయత్నించే బాలుడు నెమ్మది నెమ్మది గా నడుస్తూ తల్లి దగ్గరయ్యేసరికి ఆనందంతో ఒక్కసారిగా వేగం పెంచి ఆమె ఒడిలోకి దూకేస్తాడు. ఇక్కడ వామనుడు కూడా అంతవరకూ నెమ్మది నెమ్మదిగా నడుస్తూ, అందర్నీ పలకరిస్తూ ఉన్నవాడు ’బుడిబుడి నొడువులు నొడువుచ” ఒక్కసారిగా బలి చక్రవర్తి దగ్గరయ్యే సరికి లక్ష్యాన్ని చేరుకున్నానన్న ఆనందంతో గబగబా నడుస్తాడు. ఆ వేగమే ఈ నాలుగు గురువుల ప్రయోగానికి కారణం (చేరెన్ రాజును). ఇదీ ఆయన మనస్తత్వ పరిశీలన. పాత్రోచిత రచన సందర్భోచిత శయ్య. పద్య నిర్మాణంలోనే బాలుని నడకను అందులో రకరకాల దశలను చిట్ట చివరి వేగాన్ని చూపించగల ఈ శక్తి తెలుగు పద్యానికే ఉందేమో!


మనపద్యం - మన వ్యక్తిత్వం

ఈ యుగం ప్రత్యేకమైన కాలం. ప్రతి విద్యలోనూ ప్రత్యేక విభాగాలే. కాలికో వైద్యుడు, వ్రేలికో వైద్యుడు. ఏది వచ్చినా ఆదుకోగలననే అపద్భంధవుడు లేడు. పదిహేనేళ్ళు డిగ్రీ వరకు చదువు చెప్పక కూడా మళ్ళీ వ్యక్తిత్వ వికాసానికి ప్రత్యేక శిక్షణ, సంభషణ నైపుణ్యానికి ప్రత్యేక శిక్షణ. సంభాషణా నైపుణ్యానికి ప్రత్యేక శిక్షణ. నాయకత్వ లక్షణాలకి ప్రత్యేక శిక్షణ. అన్నింటికీ మూడేసి నెలలు శిక్షణ. మూడేసి వేలు భక్షణ. కడుపులోంచి ఇంకా బయటపడకుండానే కంగారుపడి తీసుకుపోయి కాన్వెంట్లలో అప్పగించిన, అక్కడి నుండి పది హేనేళ్ళు రచి రంపాన్ పెట్టినా పట్టుమని పది పద్యాలు అప్పగించలేడు. నోరు తెరచి నాలుగుముక్కలు కాగితం చూడకుండా మాట్లడలేడు. ఇతరుల కోసం కాకపోయినా తనకోసం తానయినా కష్టపడలేడు. నాయకుడు కాకపోయినా సరైన అనుచరుడైన కాలేడు. ఇన్ని లక్షలు ఖర్చుపెట్టి చదివించిన చివరకు విద్యార్ధులు వ్యక్తిత్వ హీనులుగానూ, ఈర్ష్యాళువులు గానూ, నిస్సంతోషులుగానూ, కోపిష్ఠులుగానూ, వృధా వేశపరులుగానూ, పరభాగ్యోపజీవులుగానూ తయారు కావడానికి కారణం ఏమిటి?

పదో తరగతి వరకు తెలుగు పుస్తకాలు చూస్తే పదిరకాల ప్రక్రియలు నేర్పేద్దామనే తాపత్రయం తప్ప పదికాలాలపాటు పదిలంగా మనస్సు మీద ముద్ర వేసేలా పది పద్యాలు నేర్పుదామనే ఆలోచన కానరావడం లేదు. ప్రాచీన పద్య సాహిత్యం మీద పక్కా వ్యతిరేకతతో పాఠాలు రూపకల్పన చేస్తున్నారనే అనుమానం సమాజంలో బలంగా ఉంది.

అదే ప్రాచీన సాహిత్యంలోని పద్యాల ద్వారా అత్యాధునిక విద్యార్ధినీ విద్యార్ధులకు ఉపయోగపడే ఎన్ని విషయాలు ఎంత చక్కగా నేర్పవచ్చో సావకాశంగ, సావధానంగా కాస్త ’లో చూపుతో’ చూద్దాం.

వ్యక్తిత్వ వికాసం (Personality Development) అంటే పదిమందినీ మించి పోవడం కాదు. పదిమందినీ కలుపుకుపోవడం. సంభాషణా నైపుణ్యం అంటే దబాయించి వాదించడం కాదు. గుబాళించేలా మాట్లడగలగడం. నాయకత్వ లక్షణం అంటే పెత్తనం (Leadership Quality) చలాయించడం కాదు; ప్రేమతో జయించడం. నిర్వహణ సామర్ద్యం (Managing Ability) అంటే నెత్తిమీద కత్తిపెట్టి పని చేయించడం కాదు. ఒత్తిడి లేకుండా ఒప్పించి పనిచేయించడం కాదు. ఇవన్నీ మన తెలుగ్ పద్యాల ద్వారా మనస్సుకి పట్టేలా చెప్పవచ్చు.

తనకోసం బ్రతికింది బ్రతుకు కాదు; పదిమందికోసం బ్రతికిందే బ్రతుకు. ఈ విషయాన్ని ఆంధ్రమహాభారతంలో శకుంతల ఎంత విశ్లేషణాత్మకంగా చెప్పిందో చూడండి.

నుతజల పూరితంబులగు నూతులు నూరింటి కంటె సూ
న్నతవ్రత! యొక బావి మేలు; మఱి బావులు నూరింటి కంటె నొక్క స
త్ర్కతువది మేలు; తత్త్కతు శతంబున కంటె సుతుండు మేలు; త
త్సుత శతకంబు కంటె నొక సూనృత వాక్యము మేలు చూడగన్

- (నన్నయ)

మూడు రోజులు ఏకాంతంగా గడిపి, గర్భిణిని చేసి, కుమారుని తో వచ్చిన స్త్రీని నువ్వెవరో నాకు తెలియదన్న పెద్దమ్నిషిని సూనృతవ్రత! అని నిండు సభలో సంబోధించడంలోనే శకుంతల్ ధైర్యం, నన్నయగారి ఉక్తి చమత్కారం కనబడుతున్నాయి. ఒక కుటుంబానికి మాత్రమే ఉపయోగపడే నుయ్యి కంటె పదిమందికీ ఉపయోగప్డే ఊరబావి మంచిదనడంలో నీకోసం నువ్వు బ్రతకడం అవసరమే అయినా పదిమంది కోసం బ్రతికే ప్రయత్నం కూడా చెయ్యమనే సందేశం లేదా? బావులు త్రవ్వడం కంటే యజ్ఞం గొప్పది. యజ్ఞంలో మఱ్ఱి, మారేడు, జువ్వి, రావి, జమ్మి, రేగు మొదలైన ఔషధ వృక్షాల సమిధలు వాడతారు. వాటి ధూమం గాలిలో కలిసి మేఘాలను కదిలించి వర్షాలు కురిపిస్తుంది. కాబట్టి నూరు బావులు త్రవ్వడం కంటే ఒక యజ్ఞం చేయడం మేలని చెప్పింది. వర్షాలు లేక పోతే త్రవ్విన నూతులు, బావులవల్ల ఉపయోగం ఏముంది? వంద యజ్ఞాలు చేయడం కంటే కూడా ఒక కొడుకుని కనడం గొప్ప విషయమని పేర్కొంది. ఎందుకంటే ఆ కుమారుడు మళ్ళీ యజ్ఞాలు చేస్తాడని. అంతేకాని వైద్య విద్యో, యంత్ర విద్యో (ఇంజనీరింగ్) పుర్తిచేసి అమెరికాకో, ఆస్ట్రేలియాకో చెక్కేస్తాడని కాదు.

ఇటువంటి సందర్భాలలోనే కొంతమంది ప్రాచీన సాహిత్యనికి లింగ వివక్ష ఆపాదిస్తారు. అందుకే కాస్త ’లో చూపు’ అవసరం. స్త్రీ పక్కన్ లేకుండా పురుషుడు ఎటువంటి యజ్ఞయాగాదులు చేయడానికి అధికారం లేదు. అందుకని యజ్ఞం చేసే కొడుకుని వీరు కంటే, ప్రక్కన కూర్చునే కూతుర్ని ఇంకొకరు కంటారు. ఆ రకంగా యజ్ఞాలు, తద్వార వర్షాలు, తద్వారా పంట, తద్వారా పాడి తద్వారా వ్యక్తికి అభివృద్ధి, గ్రామానికి పురోగతి అన్నీ సాధ్యమవుతాయి.

ఇంతవరకు భౌతికాభివృద్ధిని గురించి మాట్లాదిన భారతీయ నాయిక ’శకుంతల’ సారాంశంగ నైతికాభివృద్ధి గురించి మాట్లాడుతోంది. వందమంది కొడుకుల్ని కలిగి ఉండటం కంటే కూడా ఒక్క సత్య వాక్యానికి కట్టుబడి ఉండటం గొప్ప విషయమని చెప్పింది. (వందమంది కొడుకులు కలిగిన ధృతరాష్ట్రుని పతనం, సత్యానికి కట్టుబడి ధర్మరాజు విజయం ఇక్కడే సూచింపబడ్డాయి. ఆరకంగా దుష్యంతుని బుద్దికి ధర్మదీపికను చూపించింది. ఈ ఒక్క పద్యం ఎంతమంది వ్యక్తిత్వాలనైనా వికసింపజేయడానికి బంగారుబాట కాదా?

విద్యార్ధులు ప్రతిభ ఎలా పెంచుకోవాలో, ఆ ప్రతిభను ఎలా కాపాడుకోవాలో ఆ ప్రతిభను ఎవరికోసం వినియోగించాలో ఎంత ఆకర్షణీయంగా ఆ ప్రతిభను అందించాలో, అలా అందించగలిగితే అతనికేం ప్రయోజనమో, దేశానికి ఏం ప్రయోజనమో అన్నీ ఒకే ఒక పద్యంలో వివరించాడు ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన్న.

అటజని గాంచె భూమిసురుండంబరచుంబి శిరస్సరఝ్ఝరీ
పటల ముహుర్ముహుర్లుఠదభంగతరంగ మృదంగనిస్స్వన్
స్ఫుట నటననుకూల పరిఫుల్ల కలాప కలాపిజాలమున్
కటకచర త్కరేణుకర కంపిత సాల్ము శీత శైలమున్

పైకి హిమాలయ్ వర్ణన్లా కనిపిస్తున్నా ఈ పద్యంలో రత్నాలు చాల ఉన్నాయి. (అనర్ఘరత్నాలకు హిమాలయం పుట్టినిల్లు గదా!)
హిమాలయ శిఖరలు అంబరాన్ని చుంబిస్తున్నాయని, అక్కడినుండి జారిపడే జలధారలు మృదంగ ధ్వనులు వినిపిస్తున్నాయని, ఆ ధ్వనులకు ఆకర్షింపబడిన నెమళ్ళు బయటకు వచ్చి పురివిప్పి నాట్యం చేస్తున్నాయని పైకి కనిపించే భావం.
పదవతరగతి పరీక్షల్లో ఎనిమిది మార్కులు సంపాదించడనికి అది చాలు. కాని విద్యార్ధుల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాలంటే ఇంకాస్త లోతుల్లోకి వెళ్ళాలి.

_ _ _

విద్యార్ధి ప్రతిభ ఆకాశమంత ఎత్తు ఎదగాలి. కానీ అక్కడే ఉండిపోకూడదు. ఆ ప్రజ్ఞ్హ సెలయేటిలా క్రిందకి రావాలి. తన తల్లిదండ్రులకి తన గ్రామ ప్రజలకు సేవచేయడం కోసం స్వాదుజలంలా ఆ ప్రతిభ అందుబాటులోకి రావాలి. అలా ప్రవహించేటప్పుడు మృదంగధ్వనిలా ఆకర్షణీయంగా సాగాలి. విద్య ఎంత ఉన్నా దాన్ని ఆకర్షణీయంగా అందించడం చేతకాకపోతే ఏ రంగంలోనూ ఎవరూ రాణించలేరు. అలా అందించగలిగితే నెమళ్ళు తమంతతామే వచ్చి పురివిప్పి నాట్యం చేస్తాయంటే ప్రతిభావంతుడైన మేథావి ఎవరూ తన వినియోగదారుల్ని, ఖాతాదారుల్ని, పాఠకుల్ని, శ్రోతల్ని, ప్రేక్షకుల్ని వెదుక్కోవలసిన అవసరం లేదని సారాంశం. రత్నాల్లాంటి ఈ భావాలు పద్య సముద్రాల గర్భాల్లో ఉంటాయి. ఆ మహా కవుల అంతరంగాలు అంతలోతైనవి. వాళ్ళు సమస్త శాస్త్ర సాగరాలను ఆపోశన పట్టిన కుంభసంభవులు(అగస్త్యులు). ఇటువంటివి ఉపాధ్యాయులు శోధించి సాధిస్తే, ఆకర్షణీయంగా వివరిస్తే - మధ్యాహ్న భోజనాలు, ఉచిత పుస్తకాలు, ఉచిత దుస్తులు అవసరం లేకుండానే విద్యార్ధులు పాఠశాలలో ఉంటారు, వింటరు, బాగుపడతారు.

ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా వాక్చాతుర్యంతో బయటపడటం తెలుగు పద్యాలు తీయతీయగా నేర్పిస్తాయి. మిత్రుల మధ్య అపార్ధాలు తొలగిపోవడానికి, శత్రువులవల్ల అనర్ధాలు కలగకుండా జాగ్రత్తపడటానికి ఆంధ్రమహాభారతం - శాంతిపర్వంలోని ఒక్క పద్యం చక్కని దారి చూపిస్తుంది.

ఒక ఎలుక ఉదయాన్నే జీవయాత్ర కోసం బయలుదేరింది. కన్నం దాటి నాలుగడుగులు (ఎలుక కాళ్లతో) వేసిందో లేదో యమ ధర్మరాజులా పిల్లి ప్రత్యక్షమయింది. కంగుతింది. అంతలోనే స్తిమితపడింది. ఆ పిల్లి వేటగాడి వలలో చిక్కుకుని ఉంది. అమ్మయ్య! అనుకొని కొంచెం ధైర్యంగా ముదుకు వెళ్ళేసరికి చెట్టు మీద గుడ్లగూబ, పొదలోంచి ముంగిస ఎలుకవైపు గుర్రుగా చూస్తున్నాయి. ఇది ఎక్కడి సంకటంరా దేవుడా! అనుకొంది కానీ ధైర్యం కోల్పోలేదు. (ఎల్ కే జీ నుండి ఎం సెట్) వరకూ చదివి ఆంగ్ల భాశాసాగరాలు ఆపోశన పట్టిన అరివీరభయంకర విద్యార్ధులెవ్వరిలో ఇంత ధైర్యం కనబడదు) ఒక్క క్షణం చురుగ్గా ఆలోచించింది. పిల్లిని చూస్తే ముంగిస, గుడ్లగూబ భయప్డతాయి. కాబట్టి పిల్లి రక్షణలో ఉన్నట్లుంటే అవి తన జోలికి రావు. అంతే! ఒక ‘ఐడియా’ జీవితాన్ని నిలబెడుతుంది గదా! పిల్లి రక్షణ కోరింది. వలత్రాళ్ళు కొరికి పిల్లిని రక్షిస్తానంది. ప్రాణం మీద ఆశతో పిల్లి ఒప్పుకుంది. పిల్లి రక్షణలో ఉన్న ఎలుకను ఏమీ చేయలేమని నిర్ణయించుకొని మసకకళ్ళ గూబ, మందబుద్ధి ముంగిస అక్కడ నుండి జారుకున్నాయి. ఎలుక హాయిగా ఊపిరి పీల్చుకుంది. ఇంక పిల్లిని విడిపించాలి. తనకు ప్రాణాపాయం లేకుండా చూసుకోవాలి. అందుకే పిల్లి ఎంత కంగారు పడుతున్నా వేటగాడు దగ్గరకు వచ్చేవరకు వలత్రాళ్ళు కొరకలేదు. వేటగాడు సమీపించాక హడావుడిగా తెగ్గొట్టి పారేసింది. బ్రతుకుజీవుడా అంటూ పిల్లి పారిపోయింది. బ్రతికానురా దేవుడా అంటూ ఎలుక కన్నంలోకి దూరింది.

ఇంతటితో కథ అయిపోలేదు. ఎలుక చేసిన మేలు మరిచిపోలేని పిల్లి జీవితాంతం స్నేహంగా ఉందాం రమ్మని కన్నం దగ్గరికి వచ్చి మరీ ఆహ్వానించింది. జీవితాంతం స్నేహం అక్కర్లేదు. స్నేహం వల్ల జీవితం అంతం కాకుండా ఉంటే చాలని ఆలోచించిన ఎలుక ఇలా సమాధానం చెప్పింది.

అరులన్ మిత్రులన్ దెలియ నారయుటెంతయు సూక్ష్మకృత్య, మ
వ్వెరవతి దుష్కర, మ్మరులు వీరన నుండియు మిత్ర భావమున్
బొరయుటయున్ సుహృజ్జనము పోలి కి గల్లియు శత్రుతాగుణ
స్ఫురణ మొకప్డు సూపుటయు చూతుముగాదె ధరిత్రి నెల్లడన్
(- తిక్కన శాంతిపర్వం - ౩-227)

జీవితంలో మిత్రులెవరో శత్రులెవరో తెలుసుకోవడం చాలా కష్టం. కొంతమంది పైకి చురచురలాడే ముఖాలతో కనిపిస్తారు. కాని అవసరానికి ఆదుకొంటారు. కొందరు రాసుకు పూసుకు తిరుగుతారు. అవసరానికి ముఖం చాటేస్తారు. ఇవన్నీ జీవన యానంలో అలవాటు పడ్డ శకునాలే. అందువల్ల పిల్లిని నమ్మి ఎలుక స్నేహం చెయ్యడం ఎప్పటికీ అవివేకమే పొమ్మని చెప్పింది.

ఈ వివేకం ఈ నటి యువతులకి ఉంటే అపాయకారులయిన అబ్బాయిల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండగల్గుతారో కదా! అర్ధరాత్రి బండిమీద విహారాలు, విచ్చలవిడి విహారయాత్రలు కొంతయినా తగ్గే అవకాశం ఉందికదా!

ఈ రోజుల్లో యువతీ యువకుల్లో అనుకూల దృక్పథం కొరవడుతోంది. ప్రతిదానికీ ప్రతికూలంగా ఆలోచించడం, ఆందోళన చెందడాం, ఒత్తిడికి లోనవడం తరచుగా కనబడుతోంది.

ప్రపంచం మనం ఎలా చుస్తే అలా కనబడుతుంది. సృష్టిలో భేదం లేదు, నీ దృష్టిలో తప్ప అంటారు ఆది శంకరాచార్య. ఏ వ్యక్తి అయినా మనం ఎలా చూస్తే అలా కనబడతాడని చెప్పడానికి ప్రబంధాల్లో వర్ణనలన్నీ ఉదాహరణలే.

ఎంత వ్యతిరేకి అనుకొన్నా అతనిలో మనకు కావలసిన లక్షణాలు కొన్నయినా ఉంటాయి. అదే విషయాన్ని ఉత్తర హరివంశం అనే ప్రబంధంలో నాచన సోమ్నన్ బలరామదేవుని వర్ణన్లో స్పష్టం చేస్తాడు.

పాతాళాధిపుడైన శేషుడు ప్రలంబఘ్నుండు నారాయణ
ప్రీతింబుట్టిన శంకరుండని జనుల్ పేర్కొన్నచో నంధకో
ద్భూత స్నేహము గామపాలతయుదప్పున్ దప్పుగాకేమి? వి
ఖ్యాతిం బొందడె పాండురాంగ మహిమన్ హాలాహల స్వీకృతిన్

( నాచన సోమన)

నాచనసొమన తిక్కన గారి గాఢాభిమాని. ఆయనలాగే ఈయనకూడా హరిహర నాధునికే కావ్యాంకితం చేశాడు. ఉత్తర హరివంశంలో కథ అంతా శ్రీకృష్ణ విజయమే. కాబట్టి కృష్ణునికి తోడునీడైన బలరాముని శివుని అవతారంగా వర్ణించాలని ఆయన తాపత్రయం. కాని శివుడు అంధకవైరి బలరాముడు అంధక మిత్రుడు (అంధక వంశం వారు యాదవుల మిత్రులు). శివుడు కామపాలుడు (మన్మధుని శాసించినవాడు). బలరాముడు మన్మధుని శ్వాసించినవాడు. ఇన్ని వైరుధ్యాలున్నా కలిసే లక్షణాఅలు ఉండకపోతాయా కవి పరిశీలించగా అద్భుతమైన పోలికలు రెండు దొరికాయి.

బలరాముడు, శివుడు ఇద్దరూ తెల్లనివారే. పాండురాంగమహిమ ఇద్దరికీ ఉంది గదా అని సమర్ధించాడు. ఇంకో పోలిక హాలహల స్వీకారం అన్నాడు శివుడు హాలాహల స్వీకారం చేసిన విషయం అందరికీ తెలుసు. మరి బలరాముని విషయంలో ఇది ఎలా సరిపోతుంది? మనసుండిన మార్గముండదా? నా చన సోమన్ భషానైపుణ్యంతో దాన్ని సాధించాడు. బలరాముడు హాల(మధ్యం), హలము (నాగలి) విడిగా స్వీకరించాడు గదా అన్నాడు. అంటే శివుని విషయంలో ఏకపదమైన్ హాలాహలం బలరాముని విషయంలో రెండు పదాలు కలిపిన ద్వంద్వ సమాసం అయింది. కవిగారి నాలుకకి రెండువైపులా పదునుండటం అంటే ఇదే!

సాధారణంగా మనం ఎంత వ్యతిరేకించే వారిలోనయినా మనకు కావలసిన లక్షణాలు కొన్నయినా ఉంటాయని గ్రహించవచ్చు. ఈ భావంతో జీవిస్తే ప్రపంచంలో ప్రతికూలత లుంటాయా? ఇంతకంటే వ్యక్తిత్వ వికాసం ఉంటుందా? ఈ నాలుగు పద్యాల్లోనే ఇంత ఉంటే మొత్తం పద్య సాహిత్యంలో ఇంకెంత ఉంటుంది..? అందువల్ల తెలుగు పద్యమే తెలుగు వారి వ్యక్తిత్వం.

ఒక పద్యమ్మును నేర్చుకొన్న ధనమైయోగమ్మునై ధ్యానమై
సుకవిత్వాంచల్ దీప్తి దర్శన సుధాస్రోతస్వినీ స్నానమై
అకలంక ప్రతిభా సమన్వితమృదు వ్యాహారమై
సకలోర్విన్ కొనగోలు నెత్తినటులుత్సాహమ్ము దీపించెడిన్


కృష్ణ ధూర్జటి

ధూర్జటి అంటే శివుడు. ఆయన తెల్లగా ఉంటాడు. కాని నల్లగా ఉండే ధూర్జటి మరొకరున్నారు. ఆయనయే కృష్ణ దేవరాయల కాలంనాటి కవి ధూర్జటి. కవి ధూర్జటి నల్లగా ఉన్నాడని మనకెలా తెలుసంటే - తాను తెల్లగానో, ఎర్రగానో ఉండి ఉంటే ఆయన అందాన్ని గురించి ఆయన శతకంలో ఎక్కడో ఒకచోట ప్రస్తావించి ఉండేవాడు. అలా ప్రస్తావించ లేదు-కాబట్టి నల్లగా ఉన్నాడని అనుకొందాం. అప్పుడు ’కృష్ణధూర్జటి’ అనే పేరు చక్కగా సరిపోతుంది. పైగా కృష్ణరాయల ఆస్థానంలో ఉండే ధూర్జటి అని స్ఫురించే అవకాశం కూడా ఉంది.

అల్లసాని పెద్దన్న, నందితిమ్మన్న, మాదయ గారి మల్లన వంటి వారు రాయల ఆస్థానంలో ఉన్నారంటే ఆశ్చర్యం కలగదు కానీ ’ఛీ చీ ఈ రాజ శబ్దంబు జన్మాంతరమందు నొల్లను సుమీ’ అని కంఠోక్తిగా ప్రకటించిన ధూర్జటి ఒక రాజు ఆస్థానంలో అందునా ఎనిమిది మంది కవి పండితుల మధ్యలో చిరకాలం ఉండగలిగాడంటే అబ్బురం కలిగించే విషయమే.

శ్రీ కృష్ణదేవరాయల కవిపండిత పోషణ, వినయ విధేయతలు, పరమత సహనం విశాల దృక్పథం ధూర్జటి వంటి వీరశైవుణ్ణి, స్వాభిమానిని, రాజ భోగద్వేహిని, కుండబద్దలు కొట్టినట్లు పద్యాలు చెప్పే నిరంకుశ కవిని ఆ ఆస్థానంలో చిరకాలం కొనసాగేలా చేశాయి.

"ఆజుత మత్తులటంచు దిట్టినను రారమ్మిందు కూర్చుండుమా
పూజల్ సేయుదునంచు ధూర్జటి కవిన్ పోషించె నారాయలే
జాజుల్ పూచెడి కైత లెక్కగొనునా శైవాది భేదమ్ములన్
చేజల్లెన్ శశికాంతు లక్షతలుగా శ్రీకాళ హస్తీశుడే (సాగరఘెష -3-98)

తనలాంటివారే అయిన రాజుల్ని ఘెరంగా తిట్టిన ధూర్జటిలో కూడా కృష్ణ దేవరాయులు కవిత్వాన్ని చూసి గౌరవించాడు. ఆ సంస్కారం మనం ఇంకా అలవాటు చేసుకోవాలి. కవిత్వపుచిగురు కనిపిస్తే చాలు చెట్టుకి సాష్టాంగ పడే స్వభావంగల రాయలు ధూర్జటికి బాగా నచ్చినరాజు. అందుకే అంతటి సర్వతంత్ర స్వతంత్రుడైన కవి ఎన్నో కష్టనష్టాలు తట్టుకొని కూడా రాయల ఆస్థానంలోనే చివరివరకు నిలబడ్డాడు. కృష్ణదేవరాయలంటే కవిని పల్లకి నుండి పాద మొక పట్టున నేలను మోపనీని రాట్తల్లజుడు’ గదా!

ఎవరా పల్లకి నెక్కియున్నది? అహో! ఎవ్వారలాపల్లకిన్
చివురుంగేలను మోయచున్నది? భళా! శ్రీకృష్ణ రాయప్రభూ
కవికిన్ బ్రహ్మరథమ్ము పట్టితివి నీ కావ్యమ్ము ఖడ్గమ్ము జం
కవురా భూతలమందునెల్లెడ గుణ గ్రాహి ప్రపంచంబునన్ (సాగరఘోష -3-92)

ఇంతటి కవితా ప్రేమికుడైనా కృష్ణ దేవరాయల ఆస్థానంలో ప్రవేశం అంత సులభమేమీ కాదు. ఆ విషయాన్ని ధూర్జటి తన శతకంలో పరోక్షంగా చెప్పనే చెప్పాడు.

"వాణీవల్లభ దుర్జభంబగు భవద్ద్వారంబునన్ నిల్చిని
ర్వాణాశ్రీ జెరబట్ట జూచిన విచారద్రోహమో! నిత్యక
ల్యాణక్రీడల బాసి దుర్దశల పాలై రాజలోకాధమ
శ్రేణిద్వారము దూరజేసెదెపుడున్ శ్రీకాళహస్తీశ్వరా (శీ.కా.శతకం -2)

నిజంగానే పెద్దనాది దిగ్గజాలతో నిండిన శ్రీకృష్ణదేవరాయల భువన విజయ సభాభవనంలో స్థానం సంపాదించడం బ్రహ్మకు కూడా ఆరోజుల్లో దుర్లభమైనదే అసలిన్ని కష్టాలు పడి ఈ రాజులను ఆశ్రయించడం ఎందుకో అర్థంకాక ధూర్జటి అటువంటి అమాయకులను చూసి ఓ నవ్వు నవ్వాడు.

"మదమాతంగములున్ రథం బులు హరుల్ మాణిక్యముల్ పల్లకుల్
ముదితల్ చిత్రదుకూలముల్ పరిమళంబుల్ మోక్షమీజాలునే
మదిలో వీనినపేక్షజేసి నృపథామ ద్వార దేశంబుగా
చి దినంబుల్ వృథ పుత్రురజ్ఞలకటా! శ్రీ కాళ హస్తీశ్వరా!" (శ్రీ.కా.శ.-31)

ఎప్పుడు పడేస్తుందో తెలియని ఏనుగు ఎక్కడం కోసం, ఒళ్లంతా కుదిపేసే రథాలు అధిరోహించడం కోసం, ఒంటి మీద నిలబడని పట్టువస్త్రాల కోసం, పదినిముషాల్లో ఆవిరైపోయే పరిమళాల కోసం ఈ కవి పండితులు ఆశపడి ద్వారం ద్వారానికి ద్వారపాలకులు అడ్డగిస్తున్నా, అంగరక్షకులు అవయవాలు కుళ్లబొడుస్తున్నా, మహాపండితుల్ని మామూలు మనుషుల కంటే ఘెరంగా మందలిస్తున్నా ఆ మహారాజు దర్శనం కోసం తపించడం, ఆయన అనుగ్రహం కోసం అంగలార్చడం ధూర్జటిని ఆశ్చర్యపరిచింది. ఆవేదనకు గురి చేసింది.

సరిగ్గా ఈ ఆలోచనయే ధూర్జటి పట్ల రాయలకు ప్రత్యేకాకర్షణ కలిగేలా చేసింది. కృష్ణరాయలకు ఆత్మతత్త్వం క్షుణ్ణంగా తెలుసు. ఆ విషయం ఆముక్త మాల్యద చదివితే మనకు తెలుస్తుంది. ఆయనకు ఆత్మతత్త్వం, భౌతికభోగాల క్షణికత్వం అర్థం కాకపోతే ఆముక్తమాల్యదలో కథావస్తువు అలా ఉండదు. దిగ్విజయాలు సాధించిన పాండ్యరాజు ప్రియురాలి యింటికి వెళుతూ పురోహితుని యింట్లోంచి వినబడిన శ్లోకం విని ఆగి పోవడమేమిటి?

"వర్షార్థ మష్టౌ ప్రయతేతమాసాన్
నిశార్థ మర్థం దివసం యతేత
వార్థక్య హేతోర్వయసా నవేన
పరత్ర హేతో రిహజన్మనాచ"

వర్షకాలం కాలుకదపకుండా కాలక్షేపం చెయ్యాలంటే మిగిలిన ఎనిమిదినెలలు కష్టపడి సంపాదించుకోవాలి. రాత్రి సుఖంగా నిద్రపట్టాలంటే రేపటికి పొయ్యిలోకి పొయ్యిపైకి ఉండేలా చూసుకోవాలి. వృద్ధాప్యం సుఖంగా గడవాలంటే యౌవనంలో సంపాదించింది దాచుకోవాలి అలాగే మోక్షం పొందాలంటే ఈ జన్మలోనే పుణ్యకార్యాలు చేసి చిత్త శుద్ధి పొంది తత్త్వజ్ఞానం పొందాలి భోగాలనుభవిస్తూ కూర్చుంటే అంతూదరీ ఉండదు. సరిగ్గా ధూర్జటి శతకంలో వ్యక్తం చేసిన భావాలివే.

అమరస్త్రీల రమించినన్ జెడదు మోహం బంతయున్ బ్రహ్మప
ట్టము సిద్ధించిన నాసతీరదు నిరూఢ క్రోథమీ యెల్లలో
కములన్ మ్రింగిన మానదిందుగల సౌఖ్యం బొల్ల; నీసేవజే
సి మహ పాతక వారి రాశి గడతున్ శ్రీకాళ హస్తీశ్వరా (శీ.కా.శ.42)

ఇరువురి భావాలు తీవ్రభక్తితో నిండినవే. ఇరువుతూ స్వేచ్ఛాప్రియులే, ఇరువురూ పైకి గంభీరమైన ప్రవృత్తి లోపల తీవ్రమైన నివృత్తి కలిగిన వారే అందుకే ధూర్జటి కోరినట్లుగానే ’సర్వమునకున్, మధ్యస్థుడు, సత్యదాన దయాదుల్ గల’ కృష్ణదేవరాయలను ధూర్జటికి సంరక్షకునిగా శివుడు అనుగ్రహించాడు. పిండి కొద్దీ రొట్టె. భక్తి కొలదీ భగవదనుగ్రహం.


నాలుగు పద్యాల్లో నాలుగు పురుషార్ధాలు

భారతీయ సాహిత్యంలో ముఖ్యంగా ఆధ్యాత్మిక సాహిత్యంలో ఒక ప్రత్యేకత ఉంది. ఏ విషయాన్నైనా ఎంతగా విస్తరించి చెప్పగలదో అంతగా కుదించి కూడా చెప్పగలదు. ఇది మహాకవుల, మహావక్తల లక్షణం. భారతీయ జీవన విధానానికి ఒక ప్రత్యేకత ఉంది. ధనకన్క వస్తు వాహనాలను ఎంతగా సంపాదించి విస్తృతమైన సంసారాన్ని ఏర్పాటు చేసుకొంటుందో అంతగానూ తనలోకి తాను చొచ్చుకుపోయి అన్నింటినీ ఒక క్షణంలో వదిలేసి ఉండగలదు కూడా. ఇందుకు కారణం ఒక్కటే భారతీయ జీవనం అయోమయం కాదు. బ్రహ్మమయం.

జీవితంలో ప్రతీ సందర్భాన్నీ పండుగగా మలచుకోవాలంటే, సృష్టిలో ప్రతి వస్తువులోనూ పరమాత్మను దర్శించాలంటే ఇక్కడ ప్రతి మనిషి నాలుగు పురుషార్ధాల సాధనకు కట్టుబడి ఉండాలి. అవే ధర్మ, అర్ధ, కామ, మోక్షాలు. వీటిని అదే వరుసలో సాధించాలి. తొందరపడి దూకకూడదు. నెమ్మదిగా నడిచి ఒక్కో మైలు రాయీ దాటాలి. అందుకు మనస్సును మన అదుపులో ఉంచుకోవడం చాలా ప్రధానం. ఇందుకు మన తెలుగు సాహిత్యంలో నాలుగు పద్యాలు మనకు దీపస్థంభాలుగా నిలిచి దారి చూపిస్తాయి.

మొదటి పురుషార్ధం ధర్మం. దాన్ని సాధించాలంటే మనిషి ఎంత స్థిరంగా ఒకే చోట నిష్ఠతో ఉండాలో, మనుచరిత్ర కావ్యంలో అల్లసాని పెద్దన చెబుతారు.

" అపురిబాయకుండు - మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి భా
షాపర శేషభోగి, వివిధాధ్వర నిర్మల ధర్మ కర్మ దీ
క్షాపరతంత్రు, డంబురుహగర్భ కులాభరణం, బనారతా
ధ్యాపన తత్పరుండు ప్రవరాఖ్యుడలేఖ్య తనూ విలాసుడై "
- మనుచరిత్ర

ఇదంతా ప్రవరుని రూపగుణవర్ణన. ఇందులోనే ఆంధ్ర కవితా పితామహుడు ధర్మ పరుషార్ధ సాధనకు మార్గం చూపించాడు. ప్రవరుడు మన్మధుడంతటి సుందరాంగుడట. కాబట్టే ఆయన్ ఉన్న ఊరు విడిచిపెట్టి ఎక్కడికీ వెళ్ళలేదట. అంతటి అందగాడు ఇంటిని, ఇల్లాలిని విడిచిపెట్టకుండా ఉండటం ఆయ్న సంసారానికీ, ఇతరుల సంసారాలకు కూడా మంచిది. అనుకోని సరదాపుట్టి ఆయన హిమాలయలకు వెళితే జరిగిందేమిటో మనకు తెలుసు కదా! అలాగే ఆయన భాషా పాండిత్యంలో ఆదిశేషుడట. ఆదిశేషుడు కూడా ఉన్న చోటు నుండి కదలడు. ఆయన శ్రీమహావిష్ణువుకి స్థిరమైన శయ్య. ఆ ప్రవరుడు ఎన్నో ధర్మకర్మలు దీక్షగా చేస్తూ ఉండాడట. కాబట్టే ఆపురి బాయకుండా ఉండాలి. దీక్షపట్టిన వాళ్ళు ఇల్లు కదలరు కదా! ఆయన అంబరుహగర్భకులాభరణం ట. "అంబురుహం" అంటే పద్మం. అది చెరువులోంచి కదలదు. కదిలితే తెగిపడిపోవడాం ఖాయం. సరస్సులో ఉంటేనే దాని అందం. చూడదలచిన వాళ్ళు అక్కడికే వస్తారు. "అంబురుహ గర్భుడు" అంటే బ్రహ్మదేవుడు ఆయన ఇల్లు కదలడు. అటువంటి వంశంలో పుట్టాడు. కాబట్టే ప్రవరుడు కూడా ఊరు విడిచిపెట్టని పరమ నిష్ఠాగరిష్ఠుడు.
పైగా ఆయన "అనారత - అధ్యాపన - తత్పరుడు. అంటే ఎప్పుడూ విద్యార్ధులకు వేదపాఠాలు చెబుతూనే ఉంటాడు. అటువంటివాడు ఇల్లు విడిచిపెట్టడాం ఎలా వీలవుతుంది? అందుకే ఈ పద్యంలో ప్రవరుని లక్షణాలను తెలియజేయడానికి వాడిన ఉపమానాలన్నీ, విశేషణాలన్నీ, రూపకాలన్నీ కదలనివే.
ప్రవరుని సుస్థిరమైన ధర్మనిష్ఠను చిత్రించడానికి పెద్దన గారు స్థిరమైన వస్తువులనే, వ్యక్తులనే తీసుకొన్నారు. "ఆపురిబాయకుండ" అనే మాట మొదట చదివి వదిలైకుండా ప్రతి లక్షణం తరువాత.."కాబట్టి ఆపురిబాయకుండు" అని చదువుకుంటే పద్యం అన్వయం మరింత అందంగా ఉంటుంది. ప్రథమ పురుషార్ధమైన ధర్మాన్ని సాధించడాం అంటే నిశ్చలంగా నిశ్చయంగా స్వధర్మ నిర్వహణ చేయడమే. హిమాలయ యాత్ర పేరుమీద ఊరువాడ విడిచి ఉత్తరంగా ఎగిరిపోయిన ప్రవరుడు ఎదుర్కొన్న ఇబ్బందులూ, మానసిక క్షోభ మనం మనుచరిత్రలో చదువుకున్నాం. చివరికి అతన్ని క్షేమంగా ఇంటికి చేర్చింది కూడా అతని స్వధర్మ నిర్వహణే. బ్రాహ్మణుని ధర్మం నిత్యాగ్నిహోత్రం. ఆ అగ్నిహోత్రుడే అతన్ని హిమాలయాల నుండి ఇంటికి చేర్చాడు. అలాగే మనం అంతా సమాజంలో అస్తవ్యస్థ పరిస్థితులకు భయపడకుండా, ఆకర్షణలకు లొంగకుండా మన కర్తవ్యం మనం చేస్తే అదే మనల్ని రక్షిస్తుంది.

"ధర్మో రక్షతి రక్షిత:"

చతుర్విధ పురుషార్ధాలలో ధర్మం తరువాతది, ధర్మం చేత అదుపులో పెట్టబడవలసింది అర్ధం. అంటే ధనం. ధర్మం దీనికి మూలమై ఉండాలి. ధర్మం గానే ధనం సంపదించాలి. అధర్మంతో ఆర్జించిన విత్తం అనూహ్యంగా చేజారిపోతుంది. అర్ధపురుషార్ధం విషయంలో మనం మనస్సును ఎలా అదుపులో పెట్టుకోవాలో బమ్మెర పోతన భాగవతంలోని వామన్ చరిత్రలో వామనుని చేత చెప్పిస్తాడు.

"వ్యాప్తింజెందక వగయ్క
ప్రాప్తించిన లేశమైన్ పదివేలనుచున్
తృప్తిం జెందని మనుజుడు
సప్తద్వీపములనైన జక్కంబడునే"
- భాగవతం - వామన చరిత్ర

ధనం విషయంలో ఎప్పుడూ అసంతృప్తి పనికిరాదు. మరింత ప్రచారాన్ని (వ్యాప్తి) కోరుకోరాదు. లభించిన సొమ్మునే పదివేలుగా భావించి గలిగినవాడు లక్ష్మీ కటాక్షాన్ని సమృద్ధిగా పొందగలుగుతాడు. అటువంటి తృప్తిలేనివాడు సప్తద్వీపాల్లో పదునాలుగు లోకాల్లో ఎక్కడ తిరిగినా ఎన్ని స్వాధీనం చేసుకొన్నా సంతృప్తిని పొందలేడు. మొత్తం మీద ’ఇకచాలు’ అనుకుంటే తప్ప అర్ధ పురుషార్ధాన్ని సాధించి మన లక్ష్యానికి ఉపయోగపడేల చేసుకోలేం.

మూడవది మూలమైనది కామ పురుషార్ధం. నాలుగు పురుషార్ధాలలో ఇది చాలా విశిష్టమైనది. ఈ కామం పురుషార్ధాలలోనూ ఉంటుంది. అరిషడ్వర్గాల్లో కూడా ఉంటుంది. మానవుడు తప్పనిసరిగా సాధించవల్సిన వ్యతిరేకించవలసిన అరిషడ్వర్గాల్లోనూ (కామక్రోధలోభమోహమదమాత్సర్యాలు) కామం ఉండటం ఆశ్చర్యం కదూ! అదే వైదిక ధర్మంలో సూక్ష్మం తన జీవిత భాగస్వామి యందు కలిగిన కామవాంఛ పవిత్రమైన పురుషార్ధం. ఇతరులయందు కలిగిన కామవాంఛ భయంకరమైన శత్రువు. అందుకే ఈ కామాన్ని మొగ్గలోనే త్రుంచెయ్యాలి. ఎదగనీయకూడదు. ఇందుకు ఉదాహరణగా సారంగుతుమ్మయ్య రచించిన "వైజయంతీ విలాసం" కావ్యంలోని పద్యాన్ని పేర్కొనవచ్చు. ఆ కావ్యంలో పూజారియైన విప్రనారాయణుడుని వేశ్యయైన దేవదేవి లొంగదీసుకొందుకు వీర ప్రయత్నాలన్నీ చేస్తుంది. ఆ ప్రయత్నాలను మొదట్లోనే త్రుంచేస్తూ విప్రనారాయణుడు చక్కని మాట చెబుతాడు.

"కాకులు రావి పళ్ళు తిని గ్రక్క శిలామయదేవ మందిరా
నీకము నందు రావులు జనించును; సజ్జన చిత్తవృత్తి అ
వ్యాకులలీల రాతి గుడి వంటిది, లోకములోని వేశ్యలున్
కాకులుల వంటివారలటుగాన ప్రమాదము చేరనిచ్చినన్ "

- వైజయంతీ విలాసం

సాధారణంగా గుడి ప్రక్కన రావిచెట్టు ఉంటుంది. దాని పుట్టుక చాలా విచిత్రం. గుడికి ప్రహారీగోడ పెద్దదే ఉంటుంది గదా! ఆ గోడప్రక్క రావి చెట్టు మీద వాలిన కాకులు రావిపళ్ళు గోడమీద పెట్టుకుని తింటాయి. అలా తినడంలో కొన్ని గింజలు గోడమీద చెదురుమదురుగా ఉండిపోతాయి. ఆ గింజలు ఆ ప్రహారిగోడకుండే సన్నని బీటల్లో చేరుతాయి. ఆ పైన ఎప్పుడో వర్షం కురుస్తుంది. ఆ పగుళ్ళలో నీళ్ళు చేరతాయి. దాంతో ఆ గింజలు మొలకెత్తే గోడలో రావి మొక్కలు మొదలై క్రమంగా ఎదిగి అంత పెద్ద ప్రహారీగోడని చీల్చేస్తాయి.
గింజల కోసం వాలిన కాకులు ఇంతటి నష్టం కలిగిస్తాయని రాతికీ తెలియదు. గుడికీ తెలియదు. గుడిలో స్వామికి తెలిసినా మానవుల అజాగ్రత్తకు ఆయన ముసి ముసి నవ్వులు నవ్వుకొని ఊరుకొంటాడు.

అదే విధంగా మంచివారి మనస్సు రాతిగోడ లాంటిదట. వేశ్యలు, పరస్త్రీలు కాకుల వంటివారట. వీళ్ళు నెమ్మది నెమ్మదిగా తమ వెర్రి మాటలు, వెకిలి చూపులు అనే గింజలు సజ్జనుల మనస్సులో నాటుతూ ఉంటారు. సజ్జనులు మొదట్లో మనల్ని అవేం చేస్తాయిలే అని అశ్రద్ధ చేస్తే, అవి నాటుకొనే అవకాశం ఇస్తే ఆ వెర్రి మాటలూ, వెకిలి చేష్టలే మనస్సులో కామరూపమహావృక్షాలై వారి జీవితాన్ని నిలువునా దోచేస్తాయి. అందువల్ల ముందునుంచే అటివంటి వారికి దూరంగా ఉండటం చాలా మంచిదని విప్రనారాయణుడు దేవదేవికి కఠినంగా సమాధానం చెప్పాడు. ఇంతా చెప్పిన పెద్దమనిషిని చివరకు ఆవిడ వలలో ఎలా పడిపోయాడనేది ఆయన గ్రహస్థితికి సంబంధించిన విషయం మన్ పరిస్థితికి మనం పద్యంలో ఉండే సూక్ష్మం గ్రహించి కమం విషయంలో ఎక్కడ పురుషార్ధమో, ఎక్కడ పరమశత్రువో గ్రహించి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది.

ఇక నాలుగవ పురుషార్ధం మోక్షం. ఇది సాధించాలంటే జీవితంలో మన పాత్రకు మనం పరిమితం కావాలి. అంతేగాని అతిగా రాసుకోవడాం పూసుకోవడాం పనికిరాదు. ఆ రకమైన పాత్రధారణ ఎలా చెయ్యాలో కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి గారి పద్యరత్నం తెలియజేస్తుంది.

"వేషము వేసి పంపితివి వేదికమీదకు, పాడువేళన
మీసము లూడిపోయి విషమించె పరిస్థితి; ప్రేక్షకుల్ పరీ
హాసము చేయుచుండిరి; రహస్యముగా తెరవేయుమంచు నీ
కోసము చూడగా కసరుకొంటి విదెక్కడి దర్శకత్వమో!"

ఈ పద్యం నాటకంలో నటుడికి జీవితంలో మనకు శ్లేష సాధిస్తోంది. దుర్యోధనుడి పాత్రలో గంభీరంగా నటించే నటుడొకరు పద్యం పాడేటప్పుడు అనవసరంగా మీసాలు పదేపదే మెలివేసేసరికి అవి కాస్తా ఊడిపడ్డాయి. ప్రేక్షకులు గొల్లున నవ్వసాగారు. చేసిన తప్పు దిద్దుకోవడానికి ఒకసారి తెరదించమని దర్శకుణ్ణి కోరితే కస్సుమని తారామండలం స్థాయిలో లేచాడట. అతిగా ఎందుకు చేశావని. జీవులమైన మనందరి పరిస్థితి ఇంతే. భగవంతుడనే దర్శకుడు అందరికీ తలోపాత్ర ఇచ్చి కొద్దిసేపు ఈ ప్రపంచ నాటక రంగస్థలం మీద నటించండ్ర అంటే అందరం మన పరిమితిని మరిచిపోయి ఎక్కడలేని పెత్తనాలు చేసేసి పీకల మీదకి తెచ్చుకొని ఎలా పరిష్కరించుకోవాలో తెలియక జీవితానికి తెరదించేయమని ఏడుకొండలవాడి దగ్గర ఏడుస్తున్నాం. అలా కాకుండా నిర్మలంగా, నిరహంకారంగా మన బాధ్యతలు మనం నిర్వర్తిస్తే పరిస్థితి అంతవరకూ రాదు. అదీ ఈ పద్యం ద్వారా మోక్ష పురుషార్ధాన్ని సాధించడానికి గ్రహించవలసిన అంతరార్ధం. తెలుగు పద్యాల్లో ఇంతటి ఆధ్యాత్మిక శక్తి ఉంది. అందుకే పాల్కురికి సోమన " తెలుగు మాటలనంగ వలదు, వేదములు కొలదియగా చూడండి" అని పేర్కొన్నారు.


ఆర్షధర్మ ప్రతీక - ఆముక్త మాల్యద

మనిషి మెదడు రెండు భాగాలుగా ఉంటుంది. అందులో కుడిభాగం శాస్త్ర సాంకేతిక విషయాలకు ఎక్కువగా స్పందిస్తుందని, ఎడమభాగం కళాభావాలకు ఎక్కువగా స్పందిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక మనిషి మెదడులోనే రెండు భాగాల మధ్య ఇంత తేడా ఉన్నప్పుడు ఒకే భూమండలం మీద ప్రాక్పశ్చిమ భాగాల మధ్య మరెంతో తేడా ఉండటం ఆశ్చర్యమేమీ కాదు. తూర్పుదేశాలలో కవులు, కళాకారులు ఎక్కువగా ఉండడానికి, పశ్చిమదేశాలలో శాస్త్రవేత్తలు ఎక్కువగా ఉండటానికి కారణం ఇదే. ఇది భగవంతుని సృష్టిలోని వైవిధ్యమే తప్ప వైరుధ్యం కాదు.

రాగరంజితమైన ఒక సంధ్యాసమయం సహజ జలధారలతో సాగిపోయే నదీతీరంలో ఒక కొండ ప్రక్కన నిలబడి చూస్తున్న ఒక భారతీయునికి ఏమనిపిస్తుంది? అక్కడ ఎవరైనా ఒక గుడి కడితే బాగుండుననిపిస్తుంది. అదే ఒక పాశ్చాత్యునకైతే తానే ఒక ఖరీదైన హోటల్ కట్టేయాలనిపిస్తుంది. అదీ తేడా. ఈ బేధం వారికి మనకి భాషా నిర్మాణంలో, వేషధారణలో, భావధారలో, పరిశోధనా సారంలో, ఆలోచనలో ఆతిథ్యంలో, ధనార్జనలో, ధర్మ నిర్వహణలో అన్నింటా... అన్నింటా.. కనిపిస్తుంది.

అంత ప్రత్యేకతను సంతరించుకొన్న భారతీయ ధర్మ సంస్కారం ‘ఆముక్తమాల్యద’ కావ్యంలో ఎలా వ్యక్తమయ్యిందో చూద్దాం. ఈ కావ్య రచన విషయంలో పెద్ద చర్చ ఉంది. ఇంత లోతైన కావ్యాన్ని రచించే తీరిక రాయలకు లేదనీ దీన్ని పెద్దన్నో, మరెవరో రచించారని కొందరి అభిప్రాయం. కానీ ఈ కావ్య శైలికి పెద్దన శైలికి చాలా తేడా ఉంది. ఇందులో ఒక ‘రాజు’ మాత్రమే రాయగలిగిన పద్యాలు చాలా ఉన్నాయి. అదీగాక కవిత్వం రచించడానికి ఉండవలసింది తీరక కాదు. తీవ్రమైన కోరిక. ఆ కోరిక తీవ్రంగా ఉంది కాబట్టే పగలు ఉమ్మత్తూరు కోటపై దండెత్తి ఆ విశేషాల్ని రాత్రి కూర్చుని గోదాదేవి విరహ వేదనలో చేర్చి వర్ణించాడు. (తలిరుంగైదువు - ఆముక్త - 5-85)

ఇటువంటి వర్ణనల్నే కాస్త లోతుగా పరిశీలిస్తే భారతీయ జీవన మూల్యాలు చాలా చోట్ల కనిపిస్తాయి. ప్రథమాశ్వాసంలో విలుబుత్తూరు పురంలో అర్ధరాత్రి వీచిన ఒక గాలి సృష్టించిన చిత్రవిచిత్ర పరిణామాలు చూడండి.

‘మలయపు గాలి రేల వన్మాలి విమానపతాక ఘల్లుమం
చులియబసిండి మువ్వగమి నొక్కకమాటు గదల్పనుల్కిమి న్నలమి
తదీయ హేమవరణంచల చంపక శాఖలందు బ
క్షులు రొదసేయ వేగెనని కూడుదు రల్కలుమాని దంపతుల్’
(ఆముక్త - 1-74)

అర్ధరాత్రి అందరూ ఆదమరచి నిదురిస్తున్న వేళ మలయ పర్వతదిశ నుండి ఒక పిల్లగాలి వీచిందట. ఆ గాలి విష్ణుమూర్తి కోవెల పైనుండే విమాన పతాకను తాకిందట. ఆ పతాకకుండే పసిడి మువ్వలు ఘల్లు ఘల్లు సవ్వడి చేశాయట. ఆ మువ్వల సవ్వడికి గుడిగోడ ప్రక్కనే సంపెంగ చెట్టుమీద నిదురిస్తున్న పక్షులు నిద్రలేచాయట. ఆ పక్షుల రెక్కల చప్పుళ్ళు పడకగది కిటికీలోంచి వినబడి దంపతులకు మెలకువ వచ్చిందట. వారు పడుకొనేటప్పుడు ప్రణయ కోపంతో ఎడముఖం పెడముఖంగా పడుకున్నారట. అందుకే అర్ధరాత్రి వేళ పక్షుల రొదకు మెలకువ రాగానే తెల్లవారిందనుకొని భ్రమపడి మళ్ళీ ఏకాంత సమయం దొరకదు కదా అని దంపతులు కూడిమాడి ఆనందంగా గడిపారట.

గాలి వీయడం, ఆ గాలి తాకిడికి గుడిపైన మువ్వలు మ్రోగడం, ఆ మువ్వల సవ్వడికి పక్షులు నిద్రలేచి తెల్లవారిందనుకొని భ్రమపడి వేటకు బయలుదేరుతూ తోటి పక్షులను లేపుతూ పెద్దగా రొదచేయడం, ఆ పక్షుల రొదకు తెల్లారిపోయిందని భ్రమపడి అలకలు మాని దంపతులు అనురాగ బంధంతో ఏకమవ్వడం ...ఇవన్నీ కలిసి ఒక చిత్రమైన సంపుటిలా పుష్పగుచ్ఛంలా లేవూ? భారతీయ జీవన దృక్పథం వెలుగులో ఈ సంపుటిని పరిశీలిస్తే ఇది చతుర్విధ పరుషార్ధాల సంపుటి తప్ప మరొకటి కాదని స్పష్టమవుతుంది.

గాలివీయడం ధర్మం. దాని ధర్మం అది చేసింది. పక్షులు వేటకు బయలుదేరడం అర్ధపురుషార్ధం - అంటే సంపాదన. దంపతులు లేచి కలవడం కామ పురుషార్ధం. ఈ నాలుగూ సహజంగానే సాధింపబడే విధానాన్ని ఈ కవిరాజు మనోహర శృంగార రసంతో జోడించి అద్భుతంగా చెప్పాడు. పైగా గాలి వీచి భ్రమపడివీయలేదు. సహజంగానే వీచింది. గుడిగంటలు భ్రమపడి మ్రోగలేదు. గాలి తాకిడికి సహజంగానే మ్రోగాయి. కాని పక్షులు తెల్లారిపోయిందనుకొని భ్రమపడి సంపాదనకు బయలుదేరతాయి. అలాగే దంపతులు కూడా తెల్లవారిందనుకొని భ్రమపడి కలిశారు. అంటే అర్ధకామాలు భ్రమతో కూడిన సుఖాలనిస్తాయని ధర్మమోక్షాలు భ్రమకు అవకాశమే లేని సహజానందాన్నిస్తాయని అర్ధం కావడం లేదూ? ఒక్క గాలి వీచినందువల్లనే ఈ పరిణామాలన్నీ జరిగాయి. అంటే నీ ధర్మం నువ్వు గాలి వీచినంత సహజంగా నిర్వహిస్తూపోతే ఉంటే మిగిలిన ఫలితాలు వాటంతట అవే కలుగుతాయనే పరమార్ధ రహస్యాన్ని ఈ పద్యం బోధించడం లేదూ? అసలీ దేశంలో దంపతులు అన్యోన్యంగా ఉండకుండా ఒక్కక్షణం ఎడముఖం పెడముఖంగా ఉంటే ఇక్కడ గాలి కూడా సహించదని ఏదో ఒకటి చేసి ఆ ఇద్దరినీ కలుపుతుందని అర్ధం కావడం లేదూ? మనది విడాకుల సంస్కృతి కాదనీ ‘మావిడాకుల’ సంస్కృతి అనీ ఈ పద్యం ఎలుగెత్తి చాటడం లేదూ? కేవలం నాలుగు పాదాల పద్యంలో నాలుగు పురుషార్ధాలకు సంబంధించిన గంభీరతత్త్వాన్ని పరమ సహనంగా చెప్పిన ఈ కవిరాజు పట్టాభిషేక మహోత్సవాలు అయిదు వందల ఏళ్ళేమిటీ! అయిదు వేల ఏళ్ళ తరువాత కూడా జరుపుకోవలసిందే.

ఈ కావ్యంలో తృతీయాశ్వసంలో ‘ఖాండిక్య కేశిధ్వజోపాఖ్యానం’ అని భారతీయ రాజనీతిని విశదీకరించే చక్కని కథ ఒకటి ఉంది. ఈ ఇద్దరికీ జరిగిన యుద్ధంలో ఖాండిక్యుడు ఓడిపోయి అడవులపాలయిపోతాడు. అయినా మంచి రోజుల కోసం ఎదురుచూస్తూ తాత్త్విక చింతనతో జీవితం గడుపుతూ ఉంటాడు. ఈలోగా జయించిన కేశిధ్వజుడు ఒక యజ్ఞం తలపెడతాడు. ఆ యజ్ఞధేనువు పులివాతబడి మరణిస్తుంది. మధ్యలో ఆగిపోయిన యజ్ఞాన్ని ఎలా పరిపూర్ణం చెయ్యాలో తెలియక పురోహితులనడిగితే వారీ విషయంలో సమగ్ర పరిజ్ఞానం ఉన్నవాడు ఖాండిక్యుడొక్కడే అంటారు. విజయగర్వంతో ఉండవలసిన కేశిధ్వజుడు ఏ మాత్రం సిగ్గుపడకుండా యజ్ఞ పరిసమాప్తి కోసం ఖాండిక్యుని ఆశ్రయిస్తాడు. తనని ఓడించాడానే బాధ, కక్ష ఏమాత్రం లేకుండా ఖాండిక్యుడు అతన్ని శిష్యునిగా స్వీకరించి అధ్వరపరిజ్ఞానాన్ని బోధిస్తాడు. గెలిచిన రాజుకి గర్వం లేకపోవడం, ఓడిన రాజుకి బాధలేకపోవడం ఇద్దరూ యజ్ఞం కోసమే తమ ధర్మాలు తాము నిర్వర్తించడమే ఆర్షధర్మ సంస్కారం. ఇది ఈ దేశంలోనే సాద్యం.

ఇంతటితో కథ అయిపోలేదు. ముగింపులో మరో చిత్రమైన తాత్త్వికమైన మలుపు. యజ్ఞ రహస్యాలు బోధించిన ఖాండిక్యునికి గురుదక్షిణ యిస్తానని కేశిధ్వజుడు వినయంగా విన్నవించి కోరుకుంటాడు. శత్రుత్వం శత్రుత్వమే. సంప్రదాయం సంప్రదాయమే. కోల్ఫోయిన రాజ్యాన్ని కోరుకున్నా ఇవ్వడానికి కేశిధ్వజుడు సిద్ధంగా ఉన్నాడు. అయినా ఖాండిక్యుడు రాజ్యము, సంపదలు శ్రమ లేకుండా వచ్చిపడుతున్నా సరే, కోరకుండా కేశిధ్వజునికి బాగా తెలిసిన బ్రహ్మజ్ఞానాన్ని తనకు బోధించమని అర్ధిస్తాడు. ఏమిరాజులు వీళ్ళు! ఏమి వీరి హృదయ గాంభీరాలు! అప్పుడు కేశిధ్వజుడు. ఆశ్చర్యపడి రాజ్యం ఎందుకు కోరుకోవడం లేదు అంటాడు. ఖాండిక్యుని సమాధానం చూడండి.

‘విను కేశిధ్వజ! ధాత్రివేడిమికి నావేదించెదన్ హేతు వ
జ్ఞానకున్ గాక వివేకికేల జనియించున్ కాల్యిమెందున్? రణం
బున బాడిన్ రిపు గూల్చు వాడియు ప్రజాపోషంబు ధర్మంబూ
జునకౌ; నైన నశక్తుద్వద్విజితరాజ్యున్నన్నఘం బంటునే?
(ఆముక్త -3 - 61)

‘భౌతిక సంపదలు కోరేవారు శ్రమపడకుండా దానధర్మాల ద్వారా పొందాలనుకోవడం అజ్ఞానుల లక్షణం. వివేకవంతుడు అలా ఆలోచించడు. యుద్ద రంగంలో జయించి క్షత్రియధర్మం ప్రకారం రాజ్యం స్వీకరిస్తేనే కానీ యాచన ద్వారా కాదు. అయినా నేను నీకంటె బలహీనుణ్ణి కాబట్టి నీ చేతిలో ఓడిపోయాను. ఇందులో నేను బాధపడి క్రుంగిపోవలసిందీ లేదు. నన్ను అంటుకొనే పాపమూ లేదు’ అంటాడు ఖాండిక్యుడు.

అంటే రాజులు క్షత్రియధర్మంగా భావించి ధర్మరక్షణ కోసం యుద్ధాలు చేశారు. కానీ రాజ్య కాంక్షతో కాదన్నమాట. మరి ధర్మం కోసమే అయితే ఇద్దరిదీ ధర్మం ఎలా అవుతుంది అంటే ఎవరి ఆలోచనను వారు ధర్మంగా భావించారన్నమాట. అంటే అక్కడ ఏదో ధర్మసంక్లిష్టత ఉందన్నమాట. యుద్ధం చేసినా ఓడినా, గెలిచినా వారు ఆశ్రయించింది ధర్మ మార్గాన్ని. ఆరాధించింది బ్రహ్మతత్త్వాన్ని. ఇదీ భారతీయ ధర్మ సంస్కారం. ఆముక్తమాల్యద కావ్యసారం. ఈ మహత్తర మానవీయ ధర్మ పరిరక్షణే.


ఒకే పద్యంలో విద్యావ్యవస్థ

సృష్టిలో ప్రతి ప్రకృతి శక్తిని దేవతగా భావించడం భారతీయ సంప్రదాయంలో విశిష్టత. ఒక్క ప్రకృతి శక్తులనే కాదు మన జీవితంలో అత్యవసరమైన ధనం మనదృష్టిలో వట్టి రూపాయి కాదు. సాక్షాత్తు లక్ష్మీదేవి. అలాగే జ్ఞానాన్నిచ్చే విద్య కేవలం చదువు కాదు. సాక్షాత్తు సరస్వతీదేవి.

అటువంటి సరస్వతిని బమ్మెర పోతన్న తన భాగవతంలో విశేషంగా ప్రార్ధించాడు. ఆ పద్యం భారతీయ విద్యావ్వవస్థను మొత్తం ప్రతిబింబిస్తుంది.

క్షోణితలంబు నెన్నుదురు సోకగ మ్రొక్కి నుతింతు సైకత
శ్రోణికి చంచరీకచయ సుందరవేణికి, రక్షితామర
శ్రేణికి, తోయజాతభవ చిత్త వశీకరణైక వాణికిన్
వాణికి, అక్షదామశుక వారిజ పుస్తక రమ్యపాణికిన్

ఈ పద్యం చివరి పాదంలో సరస్వతీదేవి చేతుల్లో జపమాల(అక్షదామం), చిలుక(శుకం), పద్మం(వారిజం), పుస్తకం ఉంటాయని వర్ణించాడు. మనం ఇప్పుడు చూస్తున్న సరస్వతి చేతుల్లో జపమాల, పుస్తకం ఉండి మరో రెండు చేతుల్తో వీణ వాయిస్తూ ఉంటుంది. పోతన ఈ మూర్తినే వర్ణించి ఉంటే వీణ ఎందుకు వదిలేస్తాడు? పైగా చేతుల్లో లేని పద్మాన్ని, చిలుకను, చేతుల్లోనే ఉన్నటుగా రమ్యపాణికిన్, అని ఎందుకు వర్ణిస్తాడు? అంటే మనం చూస్తున్న సరస్వతీమూర్తి వేరనీ, పోతన వర్ణించిన మూర్తి వేరనీ అర్ధమవుతోంది గదా! అయితే వీణ లేకుండా అక్షదాసు శుక వారిజ పుస్తకాలు చతుర్భుజాల్లో ధరీంచిన ఈ మూర్తి ఎవరు? ఇదే దృష్టితో వేదవిద్యలోను, సంస్కృత సాహిత్యంలోను నిష్ణాతులయిన పెద్దలతో ఆలొచిస్తే వారు పోతన వర్ణించింది ‘శారదామూర్తి’ అనీ, ఆవిడ వైదికవిద్యలకు అధిదేవత అనీ, మనం చూస్తున్న సరస్వతీమూర్తి లౌకిక విద్యలకు అధిదేవత అనీ వారి అభిప్రాయం చెప్పారు. ఈ వాదానికి సమర్ధనగా శృంగేరీ శారదాపీఠం వారు ప్రకటించిన శారదామూర్తిని చూస్తే ఆవిడ చేతుల్లో ఈ నాలుగు ఉండటం, వీణ లేకపోవడం కనిపిస్తుంది. మొత్తం మీద పోతన ప్రార్థించిన ‘వాణి’ లలితాదేవి యొక్క జ్ఞానస్వరూపంగా భావించే శారదాదేవి అని బోధపడుతుంది. మొత్తం మీద కొండని త్రవ్వి ‘ఎలుక’ని కాదు; ‘పలుకు చిలుక’ను పట్టగలిగాం.

ఇక - ఇప్పుడు అసలీ నాలుగు వస్తువులు శారదాదేవి చేతుల్లో ఎందుకు ఉంటాయి? వాటి పరమార్ధం ఏమిటి? అని ఆలోచిస్తే భారతీయ విద్యా లక్ష్యాలన్నీ బోధపడతాయి. భారతీయ జీవన విధానంలో ఒక ప్రత్యేకత ఉంది. ఏ మనిషయినా, స్త్రీ పురుషులలో ఎవరయినా ధర్మ, అర్ధ, కామ, మోక్షాలు వరుసగా సాధించడమే జీవిత లక్ష్యంగా భావిస్తారు. విద్యద్వారా ఈ చతుర్విధ పురుషార్ధాలు సాధించడమే లక్ష్యమని ఆ నాలుగు ప్రతీకలు సూచిస్తున్నాయి. అమ్మవారి చేతుల్లో ఉండే పుస్తకం ధర్మానికి ప్రతీక. పుస్తకం ద్వారానే మనకు అన్ని ధర్మాలు తెలుస్తాయి. పద్మం అర్ధానికి ప్రతీక. పద్మం నుండే లక్ష్మీదేవి జన్మించింది. పద్మం అనేది సంస్కృతంలో డబ్బు లెక్కపెట్టే ఒక సంఖ్య కూడాను. చిలుక కామ పురుషార్ధానికి ప్రతీక. జపతపాల ద్వారానే గదా సిద్ధిపొందేది. విద్య ద్వారా ఈ నాలుగు పురుషార్ధాలు సాధించాలనీ, అప్పుడే మనిషికి భవబంధాల నుండి విముక్తి అని తెలియజేయడం కోసమే విద్యాదేవత తన చేతుల్లో ఆ నాలుగు వస్తువులనీ ధరించిందనీ గ్రహించవచ్చు. ‘సావిద్యా యా విముక్తయే’ అని గదా ఆర్యోక్తి.

మనిషి ధర్మంగా జీవించాలి. మంచి వృత్తులు చేపట్టాలి. ఆ ధర్మం ద్వారా అర్ధం సంపాదించాలి. ఆ అర్ధం ద్వారానే సముచితమైన కామనలు (కోరికలు ) తీర్చుకోవాలి. ఆ కోరికల్లో పడి కొట్టుకుపోకుండా మోక్షం కోసం ప్రయత్నించాలి. ఇదే మానవజీవిత లక్ష్యమని భారతీయ సంస్కృతి ప్రబోధిస్తోంది. అందుకే పోతన అమ్మవారి స్వరూపాన్ని ఆ విధంగా వర్ణించాడు. ఇదీ తెలుగు పద్యం పరమార్ధం.


అతడుంటే అన్నీ ఉన్నట్లే

`తన వెంటన్ సిరి, లచ్చి వెంట నవరోధ వ్రాతమున్ దాని వె
న్నను బక్షీంద్రుడు, దాని వెన్నను ధనుఃకౌమోదకీ శంఖచ
క్ర ని కాయంబును, నారదుండు, ధ్వజనీ కాంతుడునై వచ్చిరా రొ
య్యన వైకుంఠ పురంబునం గలుగు వా రాబాల గోపాలమున్'

ఈ పద్యం ఆంధ్ర మహాభాగవతంలోని గజేంద్రమోక్షం ఘట్టంలోనిది. దీని అర్ధమే పోతన జీవన విధానం.

గజేంద్రుడు మొసలి బారి నుండి తనను కాపాడమని ఎవరిని ప్రార్ధించాడు? భాగవత పద్యాలలో చూస్తే "ఈశ్వరా" అనే సంభోధనలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ ఈశ్వరుడంటే శివుడు కాదు. విష్ణువూ కాదు. బ్రహ్మ అస్సలే కాదు. మొత్తం అనంతకోటి బ్రంహ్మాండాలకు అధిపతియైన పరమేశ్వరుడన్న మాట. అందుకే ’పరమేశ్వరుడెవ్వరు మూలకారణం బెవ్వడు’ అని పేర్కొన్నాడు.సర్వలోకాధిపతి, ఆత్మచైన్య స్వరూపుడు అయిన భగవంతుణ్ణి ప్రార్ధిస్తే విష్ణువు చక్రాయుధుడై వచ్చి కాపాడడమేమిటి? అంటే మనం భగవంతుణ్ణి ’ఫలానా రూపంలో వచ్చి నన్ను కాపాడు’ అని ప్రార్ధిస్తే అలాగే వస్తాడు. ఏ రూపమో ప్రత్యేకించి చెప్పకపోతే స్థితికర్త, పాలన, పోషణ చూసే బాధ్యత కలవాడు కాబట్టి విష్ణుమూర్తి వచ్చి కాపాడతాడు. లోకంలోనూ అంతే మనకు ఆపద వచ్చినప్పుడు ఎవరినైనా పేరుబెట్టి పిలిచి, లేదా వారింటికి వెళ్ళి అర్ధిస్తే వారే కాపాడతారు. అలా కాకుండా కాపాడండి, కాపాడండి అని అర్ధిస్తే దగ్గరలో పోలీసు వారు వచ్చి కాపాడతారు. రక్షణ బాధ్యత వారిది. వారే కాక మరో పది మంది కూడా వచ్చి కాపాడతారు. అందుకే విష్ణు రూపంలో సర్వేశ్వ్హరుడు వచ్చాడు.

అది సరే గజేంద్రుడు కేవలం భవవంతుణ్ణి వచ్చి తన ప్రాణాలు కాపాడమని మాత్రమే కోరాడు. కాని ఆయన వెంట లక్ష్మీదేవి, ఆమె వెంట అంతఃపుర స్త్రీలు, వారి వెంట గరుత్మంతుడు, అతని వెనుక విల్లు, గద మొదలైన ఆయుధాలు, ఆపైన వైకుంఠానికి విష్గ్ణు దర్శనం కోసం వచ్చిన నారద మహర్షి, ఇంకా సర్వసైన్యాధిపతియైన విష్వక్సేనుడు...ఒకరేమిటి వైకుంఠంలో ఉండే బాలుర నుండి గోపాలుర వరకు అందరూ గజేంద్రుని వద్దకు వచ్చేశారు. అంటే మనం భగవద్దర్శనం కోసం ప్రార్ధిస్తే చాలు. ఆ దర్శనంతోనే సిరిసంపదలు వస్తాయి. దాసదాసీజనం సమకూరుతాయి. వస్తు వాహనాలు కొనగలిగే శక్తి కలుగుతుంది. మన రక్షణ కోసం సర్వాయుధాలు వస్తాయి. మహాత్ములు, మహాయోగుల సాంగత్యము కలుగుతుంది. అత్యున్నత అధికారులు అందరూ మన చుట్టూ తిరుగుతారన్నమాట. ఈ రహస్యం తెలిసిన వాడు కాబట్టే పోతన మహాకవి రాజుల చుట్టూ, రాణుల చుట్టూ, మంత్రుల చుట్టూ, వ్యాపారుల చుట్టూ తిరగడం మానేసి ఒక్క విష్ణువు చుట్టూ మాత్రమే మనస్సుని ప్రదక్షిణం చేయిస్తూ భాగవతం రచించాడు. అందుకే ఆయన ఇహలోక జీవితమూ సుఖంగా ముగిసింది. (శ్రీనాధునిలా కాకుండా) పరలోకంలో మోక్షమూ దక్కింది. ఆయన రచించిన భాగవతం ఇవ్వాళ ప్రపంచమంతా ప్రశంసలందుకుంటోంది. ఈనాటి కవులూ, పండితులూ ఈ రహస్యం గ్రహించి మంత్రుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగకుండా భగవంతుని యందు విశ్వాసంతో, ఆత్మ విశ్వాసంతో తమ పని ఏదో తాము చేస్తే దక్కవలసిన గౌరవాలు అవే దక్కుతాయి.