శ్రీ గరికిపాటి నరసింహారావు
మహాసహస్రావధాని, ప్రవచన కిరీటి, పద్యధారణలో ప్రపంచ రికార్డు స్థాపించిన డా. గరికిపాటి నరసింహారావు (పద్మశ్రీ పురస్కార గ్రహీత), భాద్రపద శుద్ధ పాడ్యమి, 1958 సెప్టెంబర్ 14వ తేదీ, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం తాలూకా, బోడపాడు అగ్రహారంలో శ్రీ వెంకట సూర్యనారాయణ, శ్రీమతి రమణమ్మ దంపతులకు జన్మించారు. గరికిపాటివారు తెలుగులో ఎం.ఎ., ఎం.ఫిల్., పి.హెచ్.డి. చేశారు.
1978 సంవత్సరం జూలై 23వ తేదీ గురుపౌర్ణమి రోజున వరంగల్ జిల్లా నర్సంపేట్ గ్రామంలో ప్రవచనాలను ప్రారంభించారు. 1992 సంవత్సరంలో విజయదశమి రోజున అవధాన రంగంలోకి ప్రవేశించి ఇప్పటి వరకు 325 అష్టావధానాలు చేశారు. 10 శతావధానాలు విజయవంతంగా నిర్వహించారు. 1996 మే నెలలో, కాకినాడ పట్టణంలో 1116 మంది పృఛ్ఛకులతో 21 రోజులపాటు మహాసహస్రావధానం చేసి, 750 పద్యాల ఏకధాటి ధారణతో మహాసహస్రావధానిగా పేరుపొందారు. ఆయన అసాధారణ ధారణా సంపత్తికి నిలువుటద్దంగా ‘ధారణా బ్రహ్మరాక్షసుడు’, ‘అమెరికా అవధాన భారతి’ వంటి బిరుదులను చెప్పవచ్చు. గరికిపాటివారు ఎన్నో పురస్కారాలను, సన్మానాలను అందుకున్నారు.
డా. గరికిపాటివారు 1116 పద్యాలు (సుమారు 4500 పంక్తులు) కలిగిన స్వీయ కావ్యం ‘సాగరఘోష’ ను 8గంటల్లో ఏకధాటి మహాధారణ చేసి సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. అంతే కాకుండా అమెరికాలో 8 కంప్యూటర్లతో అష్టావధానాన్ని 2001 లో నిర్వహించి ఔరా అనిపించారు. 2006 లో బెంగళూరు ప్రయోగశాలలో మేథాపరీక్షావధానం కూడా జరిగింది. గరికిపాటివారు తెలుగురాష్ట్రాలలోనే కాక ఎన్నో దేశాలు పర్యటించి తమ వాగ్ధాటితో, అష్టావధానాలతో, ఛలోక్తులు, చమత్కారాలతో నేటి యువతకు కూడా ఉపయోగపడే విధంగా వ్యక్తిత్వ వికాస అంశాలను జోడించి అనేక ప్రసంగాలను ఇస్తూ వస్తున్నారు.
నిత్యం టి.వీలలో భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తూ హిందూమతం విశిష్టతను తెలియజెప్పడంలో వారి వంతు సహకారాన్ని అందజేస్తున్నారు. భక్తి టీవీలో 1818 భాగాలుగా ప్రసారమైన ‘ఆంధ్ర మహాభారతం’, ఏ.బి.ఎన్ లో 2000 భాగాలుగా ప్రసారమైన ‘నవజీవన వేదం’ కార్యక్రమాలతో గరికిపాటివారు కొత్త ఒరవడిని సృష్టించారు. ఇవే కాకుండా ఎన్నో కావ్యాలపై, ఆధ్యాత్మిక అంశాలపై రోజూ గరికిపాటివారి ప్రవచనాలను ప్రేక్షకులు టీవీలలో ఆస్వాదిస్తూనే ఉన్నారు. లోతైన ఆధ్యాత్మిక విషయాలను సైతం అత్యాధునిక సమాజానికి సమన్వయం చేస్తూ ‘సామాజిక వ్యాఖ్య’ కు శ్రీకారం చుట్టి ప్రవచన రంగంపై గరికిపాటి వారు తమదైన ముద్ర వేశారు.
సాగరఘోష, వ్యక్తిత్వదీపం, వైకుంఠపాళి, ఇష్టదైవం, అవధాన శతకం వంటి ఎన్నో పుస్తకాలను రచించారు. సామాజిక మాధ్యమాలపై ప్రత్యేకమైన దృష్టి సారించిన గరికిపాటివారు, ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి మాధ్యమాలలో ప్రసంగాలు అందుబాటులో ఉంచి, భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడే రీతిలో కృషి చేస్తున్నారు.