డా. గరికిపాటి గురజాడ


డా. గరికిపాటి గురజాడగారు బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు, గరికిపాటి శారద దంపతుల ద్వితీయ కుమారుడు. వీరు పుష్య శుద్ధ సప్తమి 1992 జనవరి 12, వివేకానంద జయంతి పండుగ రోజున, తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రిలో జన్మించారు. వీరు తెలుగులో ఎం.ఎ, ఎం. ఫిల్, పిహెచ్. డి చేశారు.

డా. గరికిపాటి గురజాడగారు 23 ఏళ్ల యుక్త వయస్సులో వైకుంఠ ఏకాదశి, 2015 డిసెంబర్ 20, రోజున ప్రవచన రంగంలోకి ప్రవేశించి ఇప్పటివరకు 200కి పైగా ప్రవచనాలు చేశారు. గురజాడగారు తండ్రి అడుగుజాడల్లో నడుస్తూనే ప్రవచన రంగంపై తనదైన ముద్ర వేసేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. చిన్న వయస్సులోనే మనుచరిత్ర, కాశీఖండం వంటి ప్రౌఢమైన కావ్యాలపై, రామాయణం, శ్రీమద్భాగవతం, శ్రీమద్దేవీభాగవతం, శివానందలహరి, సౌందర్యలహరి వంటి ఆధ్యాత్మిక అంశాలపై తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో ప్రసంగించారు. అంతే కాకుండా వివిధ పాఠశాలల్లో, కళాశాలల్లో వ్యక్తిత్వ వికాసంపై ఎన్నో ప్రసంగాలు చేశారు.

అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్ర కావ్యంపై డా. గురజాడగారు ఎం. ఫిల్ చేశారు. ‘మనుచరిత్ర: వ్యక్తిత్వవికాసం’ అనే అంశం పై వారి సిద్ధాంత వ్యాసాన్ని 2015లో తెలుగు శాఖ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి సమర్పించారు. మనుచరిత్ర కావ్యంపై పలుమార్లు ప్రసంగించి, మనుచరిత్ర- వ్యక్తిత్వ వికాసం అనే పుస్తకాన్ని 2020లో వెలువరించారు. గురజాడగారు ‘ఆంధ్ర మహాభారతం- సామాజికాంశాల పరిశీలన’ (ఆది పర్వం నుండి విరాట పర్వం వరకు) అనే అంశంపై పిహెచ్. డి పూర్తిచేసి తన సిద్ధాంత గ్రంథాన్ని 2020లో తెలుగు శాఖ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి సమర్పించారు.

కవిత్రయ భారతంపై ప్రత్యేకమైన ప్రసంగాలు చేసిన గురజాడగారు, తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ‘భారతంలో చిన్న కథలు’ అనే ధారావాహికకి శ్రీకారం చుట్టి ఆ కథలు నిత్యజీవితానికి ఉపయోగపడే విధంగా ఆధునికమైన సమన్వయం చేస్తున్నారు.

చిత్రమాలిక


అవార్డులు


  • పిహెచ్.డిలో అత్యుత్తమ పరిశోధనకు గాను, కేంద్ర మానవ వనరుల శాఖామాత్యులు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారి చేతుల మీదుగా, కె. కామేశ్వరీదేవి స్మారక స్వర్ణ పతక బహూకరణ, 2022.
  • ఎం. ఫిల్. తెలుగు (2014- 15)లో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ప్రథమ స్థానం, 2015.
  • ఐ. ఎం. ఏ తెలుగు అయిదేళ్ల (2009- 14) కోర్సులో ప్రథమ స్థానం సాధించినందుకు అప్పటి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ శ్రీ నరసింహన్ గారి చేతుల మీదుగా స్వర్ణ పతక బహూకరణ, 2014.
  • సిలికానాంధ్ర, టీవీ.9 వారు సంయుక్తంగా నిర్వహించిన ‘తెలుగాట’ పోటీ, ద్వితీయ ప్రకరణంలో ద్వితీయ స్థానం, 25,000 నగదు బహుమతి, 2014.
  • ఐ. ఎం. ఏ తెలుగు అయిదేళ్ల (2009- 14) కోర్సులో ప్రథమ స్థానం సాధించినందుకు జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్ నుండి ప్రతిభాపురస్కారం, 2014.
  • హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఐ. ఎం. ఏ తెలుగు సెమిస్టర్ పరీక్షలో ప్రథమ స్థానం సాధించినందుకు అప్పటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శ్రీ దువ్వూరి సుబ్బారావుగారి చేతుల మీదుగా ప్రతిభాపురస్కారం, 2009.
  • హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఐ. ఎం. ఏ తెలుగుకి నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ద్వితీయ స్థానం సాధించినందుకు అప్పటి భారత రాష్ట్రపతి శ్రీ ఏ.పి. జే. అబ్దుల కలాం గారి చేతుల మీదుగా ప్రతిభాపురస్కారం, 2009.

సామాజిక మాధ్యమాలు