ఇంద్రియ నిగ్రహం
శ్లో. పురారాతేరంతః పురమసి తతస్త్వచ్చరణయో
స్సపర్యామర్యాదా తరళకరణానామసులభా
తథాహ్యేతే నీతాశ్శతమఖముఖాస్సిద్ధమతులాం
తవ ద్వారోపాంత స్థితిభిరణిమాద్యాభిరమరాః. (సౌందర్యలహరి. 95)
అమ్మవారి కృపకి మనం పాత్రులు కావడమంటే అది సాధారణమైన విషయం కాదు. దానికీ కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అందుకు ప్రమాణం జగద్గురు శ్రీఆదిశంకరాచార్య రచించిన సౌందర్యలహరీ స్తోత్రంలో కనపడుతుంది.
పరమేశ్వరుడు త్రిపురాసుర సంహారం చేసినవాడు. మూడు పురాలు సత్వరజస్తమో గుణాలకి ప్రతీకలు. త్రిగుణాత్మకం జగత్. సృష్టి త్రిగుణాత్మకమైనది. శంకరుడి ఆయుధమైన త్రిశూలం కూడా అదే సూచిస్తుంది. పరమేశ్వరుడు గుణాతీతుడు కాబట్టి జ్ఞాననేత్రంతో చూసినప్పుడు త్రిగుణాలు భస్మం కావలసిందే. మోక్షాన్ని పొందడానికి, గుణాతీతుడైన శివుడిని చేరుకోవడానికి జ్ఞానమార్గమే శరణ్యం. అటువంటి పరమేశ్వరుడి పట్టమహిషి అమ్మవారు పార్వతీదేవి.
ఇంద్రాది దేవతలు అమ్మవారి భవన ద్వారం దగ్గర ఉండే అష్టసిద్ధులతోనే తృప్తి పడిపోతున్నారు. ‘అణిమా మహిమాచైవ గరిమా లఘిమా తథా ప్రాప్తిః ప్రాకామ్యమీశత్వం వశిత్వంచాష్టసిద్ధయః’ అని అమరం. వాటిని కాదని ముందుకి వెళ్ళగలిగిన వారికి మాత్రమే అమ్మ పాదారవిందాలని అర్చించే యోగం లభిస్తుంది.
తరళకరణానాం అసులభా… ఇంద్రియ నిగ్రహం లేనివారికి అమ్మవారి కృపకి పాత్రులయ్యే భాగ్యం కలుగదు. అంటే శమదమాదులపై నిగ్రహం ఉండాలి. శమం అంటే అంతరింద్రియ నిగ్రహం. మనస్సుని అదుపులో ఉంచుకోవడం. దమం అంటే బహిరింద్రియ నిగ్రహం. జ్ఞానేంద్రియాలు ఐదు (త్వక్ (చర్మం), చక్షు, శ్రోత్ర, జిహ్వ, ఘ్రాణము(ముక్కు)), కర్మేంద్రియాలు ఐదు (వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థ) ఈ పది బహిరింద్రియాలు.
గుణాతీతులైన పార్వతీపరమేశ్వరులను చేరుకోవడానికి గొప్ప ఇంద్రియనిగ్రహం అత్యంత ఆవశ్యకం. అనితరసాధ్యమైన ఇంద్రియనిగ్రహం ఉండబట్టే మనుచరిత్రలో ప్రవరుడు పరమపవిత్రుడైన అగ్నిదేవుడి కృపకి పాత్రుడు కాగలిగాడు.
ఇంద్రియనిగ్రహం లేకపోవడమే ఈరోజు ఎన్నో అనర్థాలకు కారణం. మనిషి ఇంద్రియాలను పూర్తిగా అదుపులో ఉంచుకోగలిగితే సమస్యలు వాటంతటవే తొలగిపోతాయి. మోక్షాన్ని చేరుకునే క్రమంలో మన దృష్టిని గమ్యం పై కాక, గమనం పై కేంద్రీకరిస్తే ఇంద్రియాలను అదుపు చేయడం సాధ్యమౌతుంది. అప్పుడే అమ్మవారి కృపాకటాక్షం కనకధారగా మన ఇంటి ముందు కురుస్తుంది.